మన రాజకీయనాయకులకు, పాలకులకు నిర్మాణాత్మక అభివృద్ధిని, వాస్తవిక అభివృద్ధిని సాధించేంత సామర్ధ్యం లేదా? అంతా కూడా ప్రచార యావేనా? ప్రజలు సాధించిన విజయాలను వాళ్ళ అకౌంట్లో వేసుకునే ప్రయత్నాలేనా? మన పాలకుల చర్యలను గమనిస్తుంటే ఇవన్నీ నిజాలే అనిపిస్తోంది. వంద కోట్ల మందికి ఎన్నో ఆశలను కల్పించి ప్రధాని పదవిని అధిష్టించిన నరేంద్రమోడీ ప్రయత్నాలు చూస్తూ ఉంటే ఇది నిజమే అనిపిస్తోంది. దేశ ప్రజలందరికీ చాలా గొప్పగా చెప్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రవేశ పెట్టిన పథకం జన్‌ధన్ యోజన. కానీ ఏం ఉపయోగం? ఆచరణలో మాత్రం అట్టర్‌ఫ్లాప్ అయింది. కనీసం ప్రధానమంత్రి అంచనాల మేరకు అయితే సక్సెస్ అవలేదు. అయితే ప్రజలకు మాత్రం ఓ ప్రచార చిత్రాన్ని చూపించడానికి ప్రభుత్వం విఫల ప్రయత్నం చేసింది. నరేంద్రమోడీ ఎక్కడ ఫీలవుతారోనని అధికార వర్గాలే కదిలాయో, లేక మోడీనే ప్రోత్సహించాడో తెలియదు కానీ ప్రధాని మానస పుత్రిక లాంటి పథకాన్ని విజయవంతం చేయడానికి బ్యాంకుల పైన ఒత్తిడి తీసుకొచ్చారు. జన్‌ధన్ యోజన పథకాన్ని సక్సెస్ చేయడం కోసం అనధికారికంగా ‘ఒక్క రూపాయి’ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అని ప్రచారం చేసి పడేశారు.
మన నాయకులందరి ఆలోచనలు కూడా ఇలాగే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం అనే రసవత్తర డ్రామాను చూశాంగా. అలాంటిదే అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి ఉద్యోగుల తరలింపు వ్యవహారం కూడా. హైదరాబాద్‌ని వదిలివెళ్ళిపోతున్నందుకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులందరూ కూడా సెంటిమెంట్ ఏడుపులు ఏడుస్తున్నారని ప్రచారం చేశారు. అమరావతిలో స్వాగత ఏర్పాట్ల హంగామా కూడా ఓ రేంజ్లో చేశారు. తీరా వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఏముంది? ఇప్పటికీ కూడా ఆ తాత్కాలిక సచివాలయానికి మార్పులు, చేర్పులు చేస్తున్నారు. నిర్మాణం కూడా పూర్తవలేదని స్వయానా మంత్రులే చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టుని 2018కి పూర్తి చేస్తామని చెప్తుంటే కూడా ఇప్పుడు ఇలాంటి అనుమానాలే వస్తూ ఉన్నాయి. ఎంత సేపూ ఏధో జరిగిపోతూ ఉంది. అభివృద్ధిలో దూసుకెళ్ళిపోతున్నాం అని ప్రచారంతో ప్రజలను నమ్మించాలన్న, వాళ్ళను మోసం చేయాలన్న తపనే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ప్రధానమంత్రి తీరు ఇలానే ఉంది. ప్యాకేజ్ ఇస్తున్నాం అని ఓ మంత్రిగారు మాటలు చెప్పారు. ఇంకా చట్టరూపం దాల్చింది కూడా లేదు. అప్పుడే సన్మానాలు మాత్రం షురూ చేశారు. ఆ ప్యాకేజ్ గొప్పదనం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గొప్పగా చెప్పడానికి నరేంద్రమోడీవారు కూడా ఆంధ్రప్రదేశ్‌కి రాబోతున్నారని తెలుస్తోంది. ఏంటో మన పాలకులు….అంతా ప్రచార యావ, ప్రచార మాయ తప్పితే పనులు ఏ మేరకు చేస్తున్నారన్నది మాత్రం అనుమానాస్పదంగా ఉంటోంది.