ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అయోధ్యలోని భవ్య రామమందిరాన్ని సందర్శించారు. పవిత్ర రామజన్మభూమిలో కొలువైన బాలరాముడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం ఇచ్చారు. దాదాపుగా మూడు గంటలసేపు ఆలయంలో ఉన్నారు.
అద్భుతమైన, మహిమాన్వితమైన అయోధ్య శ్రీరామ మందిరంలో బాలరాముడిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. ఇక్కడ ప్రార్థనలు చేయడం ఎంతో ప్రశాంతతను, ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. మరోసారి అయోధ్యకు రావడం పట్ల ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కేవలం భక్తి కోణంలోనే కాకుండా, సామాజిక కోణంలోనూ చంద్రబాబు ఈ పర్యటనపై స్పందించారు. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ ఎప్పటికీ పాఠాలే. ఆయన చూపిన ధర్మం, సత్యం అనే మార్గాలు సమాజానికి ఎప్పుడూ దిక్సూచిగా నిలుస్తాయి అని కొనియాడారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అయోధ్యను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్ళిన ఆయన, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రాముడి ఆశీస్సులు తీసుకోవడం విశేషం. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు ఆయనకు ఆలయ నిర్మాణ విశేషాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.
