హైదరాబాద్: తెలంగాణలో పార్టీ పరిస్థితిపై, పార్టీ నాయకుల వ్యవహారశైలిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు ఇవాళ ఒక ఆంగ్ల దినపత్రిక కథనం వెలువరించింది. ఆ కథనం ప్రకారం… నిన్న కేసీఆర్ అయుత చండీయాగంలో పాల్గొనటానికి హైదరాబాద్ వచ్చిన బాబు, పార్టీ తెలంగాణ శాఖకు చెందిన కీలక నాయకులతో సమావేశమయ్యారు… పార్టీ పనితీరును సమీక్షించారు. నాయకులమధ్య సమన్వయం లేకపోవటం వలన పార్టీ దెబ్బ తింటోందని అన్నారు. ముఖ్య నాయకులు రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డిల మధ్య సమన్వయం లేదని, వివిధ విషయాలలో వారి వైఖరి బాగోలేదని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా, చంద్రబాబు వారానికొకసారి హైదరాబాద్ రావాలని, పార్టీ నాయకులకు సూచనలు ఇవ్వాలని ఒక నాయకుడు సూచించగా చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలలో తాను క్షణం తీరిక లేకుండా పనులలో మునిగిపోయి ఉన్నానని, తనకు అలా రావటానికి వీలుపడదని, ప్రతిదానికీ తనపై ఆధారపడకూడదని అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తాను సూచనలు మాత్రమే చేస్తానని, పార్టీని నడిపించాల్సింది నాయకులేనని చెప్పారు. సమస్యలను గుర్తించి వాటిపై పోరాడాలని సూచించారు. ప్రతిదానికీ తనపై ఆధారపడకూడదని అన్నారు.
ఈ సమావేశం తర్వాత ముఖ్యనాయకులందరితో చంద్రబాబు విడివిడిగా సమావేశమయ్యారు. అంతర్గత విభేదాలు, పార్టీ వ్యవహారాలలో, సమన్వయంలో లోపాలను గురించి విడవిడిగా చర్చించారు. పార్టీని నడిపించటానికి, టీఆర్ఎస్ను ఎదుర్కోవటానికి ఒక బలమైన నాయకుడికోసం చూస్తున్నానని బాబు వారితో చెప్పారు. ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన వాడు, అన్ని వర్గాలనూ కలుపుకుపోయే వాడు, ఆర్థికంగా బలమైన వాడు, పార్టీకి నమ్మకంగా ఉండేవాడు, కేసీఆర్‌ను ఎదుర్కోగలవాడు, విజయకాంక్ష ఉన్నవాడు అయిన నాయకుడికోసం చూస్తున్నానని అన్నారు. ప్రస్తుతం తాను తెలుగుదేశం తెలంగాణ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే అది తనకూ, కేసీఆర్‌కు మధ్య గొడవలాగా మారుతుందని, దానిని ఆంధ్రా, తెలంగాణ గొడవలాగా చిత్రీకరించి తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడతారని బాబు చెప్పారు. తాను పూర్తి మద్దతిస్తానని చెప్పినా కూడా తెలంగాణలోని పార్టీ నాయకులలో పోరాట పటిమ, విజయకాంక్ష కనిపించటంలేదని, తానేమి చేయాలంటూ నిర్వేదం వెలిబుచ్చారు.