సిస్ట‌మ్ ఫాలో కావ‌డ‌మే బాబుకు శ్రీరామ‌ర‌క్ష‌

ప్ర‌జా జీవితంలో ఉంటే వ్య‌క్తిగ‌త జీవితాలుండ‌వా. అభిరుచులుండ‌వా. అందుకు త‌గ్గ‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం త‌ప్పా. ముఖ్య‌మంత్రిగా ప‌నిచేస్తున్నంత మాత్రాన సొంత ఇల్లు క‌ట్టుకోకూడ‌దా. ఆ ఇంటికి ఎంత ఖ‌ర్చు పెట్టార‌నేది ఆయ‌న చెబితే కానీ ఎవ‌రికీ తెలీదు. తెలీనంత మాత్రాన నోటికొచ్చిన సంఖ్య చెప్పేయ‌డ‌మేనా. చిల‌వ‌లు ప‌ల‌వ‌లుగా క‌థ‌ల‌ల్లేయ‌డ‌మేనా. ఒక బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న అత్యున్న‌త రాజ‌కీయ నాయకుడి గురించి మ‌నం మాట్లాడుతున్నామ‌న్న విచ‌క్ష‌ణ కూడా కోల్పోతున్నారు విమ‌ర్శ‌లు గుప్పించ‌డానికీ.. గ‌తంలో వైయ‌స్ జ‌గ‌న్ నిర్మించుకున్న లోట‌స్ పాండ్ భ‌వంతి గురించి ఆయన వ్య‌తిరేక మీడియా నోటికొచ్చిన రాత‌లు రాసింది. వాళ్లు ఇళ్ళు నిర్మించుకుంటుంటే మీకు చెప్పి నిర్మించాలా. వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి మాట్లాడుకునే విష‌యాల్లో సంయ‌మ‌నం పాటించాలి.

ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లోనూ, ముఖ్య‌మంత్రిగానూ ఉన్న చంద్ర‌బాబుకు వ్యాపారాలూ ఉన్నాయి. అందులో సంపాదించిన లాభాల‌తో త‌మ అభిరుచుల‌కు అనుగుణంగా ఇంటిని నిర్మించుకునే హ‌క్కూ ఉంటుంది. దాన్ని ప్ర‌శ్నించే అధికారం ఎవ‌రికీ ఉండ‌దు. రాజ‌కీయ విమ‌ర్శ‌లంటారా ఆయ‌న చేసిన తప్పుల‌పై ఎలాగూ చేస్తూనే ఉన్నారు. చంద్ర‌బాబు పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో తీసుకున్న సూట్లు గురించీ, అందుక‌యిన ఖ‌ర్చును ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం భ‌రించిన వైనం గురించి ప్ర‌శ్నించండి. ఎవ‌రూ కాద‌న‌రు. పేద‌ల‌కు ఇళ్ళు కట్టడం ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌ని. అందుకు ఓ సిస్ట‌మ్ ఉంటుంది. ఆ సిస్ట‌మ్‌ను బాబు ఎప్పుడూ బ్రేక్ చేయ‌ర‌ని ఆయ‌న్ను ద‌గ్గ‌ర్నుంచి చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు. కీల‌క‌మైన కేసుల్లో బ‌లీయ‌మైన ఆధారాలున్న‌ప్ప‌టికీ ఆయ‌న సిస్ట‌మ్‌ను ఫాలో కావ‌డం వ‌ల్లే కోర్టులు ఏమీ చేయ‌లేక‌పోయాయ‌ని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు. వైయ‌స్ఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో నామీద 27కేసులు పెట్టారు.. ఏం చేయ‌లేక‌పోయార‌న్న చంద్ర‌బాబు ఆత్మ‌విశ్వాసం వెనుక అదే సిస్ట‌మ్ ఉంది.

ఓ ముఖ్య‌మంత్రిగా ఇల్లు క‌ట్టుకుని త‌న‌కు కావాల్సిన వాళ్ళని మాత్ర‌మే పిలుచుకునే అధికారం కూడా ఆయ‌న‌కు లేదా దాన్ని కూడా ప్ర‌శ్నిస్తారా. ఆయ‌న్ను ఇంటి వాళ్ళే ఈ మాట‌డ‌గ‌లేదు. మీడియాకు.. ముఖ్యంగా సోష‌ల్ మీడియాకు ఈ అధికారం అస‌లు లేదు. సిస్ట‌మ్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌ల‌డ‌గండి, స‌మాధానాలు రాబట్టండి. ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు. విజ‌య‌వాడ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావును మొద‌టిసారి ఎమ్మెల్యే అవ్వ‌గానే మంత్రి ప‌ద‌వి ఇచ్చేయాలా అని ప్ర‌శ్నించారు. అదే ప్ర‌శ్న భూమా అఖిల‌ప్రియ‌ను అడ‌గ‌లేక‌పోయారే. ఆమె తండ్రి మ‌ర‌ణంపై విమ‌ర్శ‌నాస్త్రాలు త‌న‌కు త‌గ‌ల‌కుండా ఉండేందుకు ఇక్క‌డ బాబు సిస్ట‌మ్ ఫాలో అయ్యారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీడియా సాక్షి ఇడి అటాచ్‌మెంట్‌లో ఉంది కాబ‌ట్టి అది ప్ర‌భుత్వ ఆస్తేన‌నీ, దాన్ని తాము స్వాధీనం చేసేసుకుంటామ‌నీ ఆ మ‌ధ్య బాబుగారితో పాటు అసెంబ్లీ వ్య‌వ‌హారాలు చూసే య‌న‌మ‌ల రామకృష్ణుడుతో కూడా అనిపించారు. ఏమైంది. సాధ్యం కాలేదే. కార‌ణం సిస్ట‌మ్‌. బాబుగారి కొత్తంటికి 400కోట్లు ఖ‌ర్చ‌య్యింద‌ని ఒక‌రు, 700 కోట్లు ఖ‌ర్చ‌య్యింద‌ని మ‌రొక‌రు ఇలా ఎవ‌రికి తోచిన ఫిగ‌ర్ వారు చెప్పేస్తున్నారు. ఆ డ‌బ్బు ఆయ‌న సంపాద‌న‌తో క‌ట్టుకున్నారు త‌ప్ప ప్ర‌భుత్వ ఖ‌ర్చుతో కాదు క‌దా. పార్క్ హ‌య‌త్ సూట్ల విష‌యంలో ప్ర‌శ్నిస్తే బాగుంటుంది. ఎందుకంటే.. అది ప్రజాధ‌న దుర్వినియోగం కింద‌కొస్తుంది. వాస్తు పేరిట డ‌బ్బు దుబారా చేశార‌నండి అది ప్ర‌జ‌ల డ‌బ్బును ఇష్టారాజ్యంగా ఖ‌ర్చుపెట్ట‌డం కింద‌కొస్తుంది. ఇంత గొంతు చించుకుంటున్న ప్ర‌జాప్ర‌తినిధులు ఎవ‌రైనా ప్ర‌జ‌ల శ్రేయ‌స్సుకోసం ప్ర‌భుత్వం త‌మ‌కు అందించే సౌక‌ర్యాల‌లో ఏ ఒక్క‌టినైనా వ‌దులుకుంటున్నారా… తెలీక‌నుకుందాం.. తెలిసి ఇప్పుడు వ‌దులుకునేందుకు సిద్ధ‌మ‌వుతారా. అసెంబ్లీ స‌మావేశాలు, బీఏసీ స‌మావేశాలు, అతిథి మ‌ర్యాద‌లూ, వ‌చ్చి వెళ్ళేవారికి ఇచ్చే బ‌హుమ‌తుల‌కు ఎంత ఖ‌ర్చ‌వుతోందో ఎప్పుడైనా గ‌మ‌నించారా. తెలుసు కానీ నోరు తెర‌వ‌రు ఎందుకంటే అది త‌మ‌కు అధికారికంగా సంక్ర‌మించిన‌వి కాబ‌ట్టి.. నోరు తెరిస్తే వ‌దులుకోవాల్సి వ‌స్తుంది కాబ‌ట్టీ.
ముఖ్య‌మంత్రి సొంత విష‌యాల్లో మాత్రం త‌ల‌దూర్చేస్తారు. నోరారా విమ‌ర్శించేస్తారు. విమ‌ర్శ‌కు కూడా సిస్ట‌మ్ డెవ‌ల‌ప్‌చేస్తే బాగుంటుంద‌నిపించ‌డం లేదూ! చంద్ర‌బాబు గారూ! మీరు సిస్ట‌మ్ ఫాలో అయిపోండి. మేం మాత్రం మీరేం చేస్తున్న‌ప్ప‌టికీ చూస్తూనే ఉంటాం. దీన్ని అస‌మ‌ర్థ‌త‌గా మాత్రం భావించ‌కండి.

Subrahmanyam vs Kuchimanchi

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com