ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి.. తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టడంపై చంద్రబాబు తొలి సారిగా స్పందించారు. 27ఏళ్లు దాటిన తర్వాత కూడా అందరూ తనపై నిందలేస్తున్నారు. అయినా ఇప్పటి వరకూ స్పందించలేదు. తొలి సారిగా ఆహా టాక్‌షోలో స్పందించారు. ఆ రోజున ఎన్టీఆర్‌పై బయట నుంచి వచ్చిన వ్యక్తి ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఈ అంశాలపై మాట్లాడేందుకు నారా, నందమూరి కుటుంబాలు రెండూ కలిసి ఎన్టీఆర్‌తో మాట్లాడామన్నారు.
ఆ రోజున బీవీ మోహన్ రెడ్డి, బాలకృష్ణ, రామకృష్ణతో కలిసి ఎన్టీఆర్‌తో మాట్లాడేందుకు వెళ్లామన్నారు. ఓ మీటింగ్ పెట్టి అందరితో డిస్కస్ చేద్దామని చెప్పానన్నారు. కాళ్లు పట్టుకుని బతిమాలామన్నారు. ఆనాడు ఎన్టీఆర్ నాయకత్వంలోనే నడుద్దామనుకున్నామన్నారు. కొన్ని కారణాల వల్ల నారా, నందమూరి కుటుంబాలు.. టీడీపీ నేతలంతా కలిసి నిర్ణయం తీసుకున్నామన్నారు. రామాంజనేయ యుద్ధంలో రాముడు మీద ఆంజనేయుడిలా ఆయన కోసం, ఆయన ఆశయాల కోసం ఆ సమయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు
ఎన్టీఆర్ పై ప్రభావం చూపిన వ్యక్తి లక్ష్మి పార్వతి అని చంద్రబాబు చెప్పలేదు. ఆమె పేరును కూడా ప్రస్తావించలేదు. తను సమాధానం చెబుతున్న సమయంలో బాలకృష్ణను ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా అని ప్రశ్నించారు. దీనికి బాలకృష్ణ కూడా స్పందించారు. ఆ రోజున ఎన్టీఆర్‌తో కలిసి మాట్లాడేందుకు వెళ్లిన సమయంలో తానూ ఉన్నానన్నారు. పార్టీ సభ్యుడిగా, ఒక నందమూరి కుటుంబసభ్యుడిగా, ఒక పౌరుడిలా చెప్తున్నానని ఆ రోజున అలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పు కాదన్నారు. .
1995 ఘటనల అంశం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అటు చంద్రబాబు.. బాలకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. ఇరువురి కళ్లలో నీళ్లు వచ్చాయి. జీరబోయిన గొంతుతోనే ఆ చర్చ జరిగింది. నిజాానికి ఆ రోజున తెలుగుదేశం పార్టీతో పాటు నందమూరి కుటుంబం మొత్తం కూడా… చంద్రబాబు వైపే నిలిచారు. అయినప్పటికీ చంద్రబాబునే ప్రధానంగా నిందిస్తూ ఇప్పటికీ రాజకీయ విమర్శలు చేస్తూంటారు. ఈ ఎపిసోడ్‌తో వాటికి చెక్ పెట్టినట్లయిందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.