కొన్ని సమస్యల విషయంలో అసంతృప్తిగా ఉన్న అమరావతి రైతులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. గురువారం ఉదయం అమరావతిలో శ్రీవారి ఆలయ విస్తరణ పనులను ప్రారంభించారు. సాయంత్రం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమస్యల గురించి మాట్లాడారు. తనకు అన్ని విషయాలపై స్పష్టమైన అవగాహన ఉందని.. సమస్యల పరిష్కారం విషయంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అమరావతి కోసం రైతులు చేసిన త్యాగలపై కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా రైతులు చెప్పిన అంశాలపై సీఎం సావధానంగా విన్నారు. ఇప్పటికే వారి సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరించే విధంగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని ,మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ లతో కూడిన కమిటీ కూడా ఈ సమావేశంలో పాల్గొంది. కేంద్ర మంత్రి పెమ్మసాని రైతులు లేవనెత్తిన అంశాలపై ఎప్పటికప్పుడు స్పష్టత ఇచ్చారు. రైతులకు ఏ మాత్రం అన్యాయం జరగనివ్వబోమని గట్టి హామీ ఇచ్చారు.
తాము అమరావతిని హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయాలనుకుంటున్నామని దానికి రైతుల మద్దతు అవసరం అని చంద్రబాబు స్పష్టం చేశారు. మీరిచ్చిన మద్దతుతోనే అమరావతి ముందడుగు పడుతోందని చంద్రబాబు తెలిపారు. రెండు విడత భూసమీకరణకు వెళ్లాలనుకుంటున్నామని అన్నారు. అమరావతిని ఓ మామూలుగా నగరంగా కాకుండా ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చంద్రబాబుతో సమావేశం పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.