తెలుగువారికి ఒక స్థిరమైన రాజధాని లేకపోవడం అనేది దశాబ్దాల విషాదం. 1953లో మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయినప్పుడే భౌగోళికంగా మధ్యలో ఉన్న విజయవాడ-గుంటూరు ప్రాంతం రాజధానిగా ఉండాల్సి ఉంది. కానీ నాటి రాజకీయ సమీకరణాల వల్ల తాత్కాలికంగా కర్నూలును, ఆపై అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాల సాకుతో హైదరాబాద్‌ను రాజధానిగా ఎంచుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయాలే వెనుకబడిన ప్రాంతాల మధ్య వైరుధ్యాలకు, ఆపై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు బీజం వేశాయి. 2014లో మళ్లీ అదే అనిశ్చితి పునరావృతమయింది.
అందరి ఆమోదంతో అమరావతి
రాష్ట్ర విభజన అనంతరం ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ నిర్ణయం, వేలాది మంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చేలా ప్రేరేపించింది. అయితే, ప్రభుత్వం మారిన తర్వాత మూడు రాజధానుల పేరుతో తీసుకువచ్చిన ప్రతిపాదన రాజధాని నిర్మాణాన్ని స్తంభింపజేయడమే కాకుండా, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసింది. ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదు, భూములిచ్చిన రైతుల త్యాగాలను అవమానించడమే.
చట్టపరమైన రక్షణ – ఏకైక మార్గం
ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడాలంటే, అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా రాష్ట్ర విభజన చట్టం లో స్పష్టంగా చేర్చడం ఒక్కటే సరైన మార్గం. కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా అమరావతి హోదాను సుస్థిరం చేస్తే, భవిష్యత్తులో ఏ రాజకీయ శక్తులూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిని మార్చే సాహసం చేయలేవు. ఇది పెట్టుబడిదారుల్లో భరోసాను నింపడమే కాకుండా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రజలు ఇచ్చిన బలంతో చంద్రబాబునాయుడు కేంద్రంతో మాట్లాడి.. అమరావతికి చట్టపరమైన భద్రత కల్పిస్తున్నారు. విభజన చట్టంలో అమరావతి చేర్చే దిశగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వారంలో ఈ పని పూర్తయిపోతుంది. అసెంబ్లీలో తీర్మానం దీనికి ప్రారంభం.
ఆంధ్రుల రాజధాని అమరావతి
రాజధాని అనేది ఒక పార్టీకో, ఒక ప్రాంతానికో పరిమితమైనది కాదు. అది రాష్ట్ర ఆత్మగౌరవ చిహ్నం. ఎందరో అసురుల వంటి శక్తులు అడ్డుపడినా, చట్టబద్ధమైన రక్షణ లభిస్తే అమరావతిని కదిలించడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రజల ఆవేదన, రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించాలంటే, ఢిల్లీ స్థాయిలో రాజధాని అంశంపై ఒక స్పష్టమైన చట్టపరమైన ముద్ర పడాల్సిందే. ఇప్పుడు విభజన చట్టంలోనే అమరావతిని మన రాజధానిగా చేర్చడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఎంత మంది అసురులు వచ్చినా.. రాజధానిగా అమరావతిని మార్చలేరు.


