ఏపీ సీఎం చంద్రబాబునాయుడు .. ఎమ్మెల్యేలకు సమయం ఇస్తున్నారు. తనను కలవాలని అనుకుంటున్న వారిని, తాను కలవాలని అనుకుంటున్న వారిని ఆయన సమయంను బట్టి పిలుస్తున్నారు. రోజుకు ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలకు సమయం ఇస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తమ సమస్యలు,కష్టాలు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ సమస్యలను వివరిస్తున్నారు. పార్టీ పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు కూడా వారితో సమావేశానికి ముందే మొత్తం సమాచారం తెప్పించుకుని. ..వారి తప్పులు ఉంటే గట్టిగానే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కరెక్ట్ చేసుకోవాలని సలహాలిస్తున్నారు.
కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 135 మంది టీడీపీకి ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలతో నిరంతరం టచ్ లో ఉండటం కష్టమే. చాలా మంది ఎమ్మెల్యేలకు అపాయింట్లు ఇవ్వడం కూడా కష్టమే. అయినా చంద్రబాబు సమయం చూసుకుంటున్నారు. ఎమ్మెల్యేల విషయంలో కేర్ ఫుల్గా ఉండాలని నిర్ణయించుకున్నారు. వారిపై పర్యవేక్షణ లేదు అనుకుంటే వారు దారి తప్పే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో అధినేతను కలవడం కష్టం అనుకుంటే దూరం పెరుగుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు.
వైసీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేదు. ఐదేళ్ల కాలంలో జగన్ ను కలవలేకపోయిన ఎమ్మెల్యేలూ ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాల్లో, పార్టీ సమావేశాల్లో పలకరింపులు మాత్రమే ఉండేవి. ఎమ్మెల్యేలను కలిస్తే.. వారు నిధులు అడుగుతారని.. తన స్థాయికి ఫలానా ఎమ్మెల్యేతో భేటీ అనవసరం అని జగన్ భావించడం వల్ల భేటీలు జరగలేదు. కానీ చంద్రబాబు అలా అనుకునే లీడర్ కాదు. అందరికీ తగినంత సమయం ఇచ్చి కలుస్తున్నారు. వారి కష్టాలు తీరుస్తున్నారు..తప్పుు చేస్తూంటే.. హెచ్చరికలు కూడా జారీ చేస్తారు.