చంద్రబాబునాయుడు నెలకోసారి స్వచ్ఛ ఆంధ్ర అని.. పెన్షన్లు ఇచ్చేందుకని.. మరో పథకం అని ప్రజల్లోకి వెళ్తున్నారు. అలా వెళ్లినప్పుడు ఆయన సామాన్యులతో కలసిపోతున్న వైనం వైరల్ అవుతోంది. ఆ దృశ్యాలు అద్భుతంగా ఉంటున్నాయి. ముందుగానే ప్లాన్ చేసి..షూట్ చేసుకుంటున్నారని విపక్షాలు విమర్శించవచ్చు కానీ.. ఆ ఎమోషన్లు మాత్రం డ్రామాలు కాదు. చంద్రబాబుతో మాట్లాడేవారు.. చంద్రబాబు మాట్లాడేవారు అంతా సాధారణ ప్రజలే. వారు తమ ఎమోషన్లను దాచుకోవడం లేదు.
ఎక్కడికెళ్లినా సామాన్యులతో మమేకం
పెద్దాపురం పర్యటనకువెళ్లిన చంద్రబాబు అక్కడ పెద్దలతో.. పిల్లలతో కలసిపోయిన వీడియోలు అందర్నీ ఆకట్టుకున్నాయి. గతంలో ఆటో డ్రైవర్ ఇంటికి, చేతి కళాకారుని ఇంటికి.. బార్బర్ దుకాణానికి ఇలా చాలా చోట్లకు వెళ్లారు. ప్రతి చోటా చంద్రబాబు తాను అనుకున్న ఇంపాక్ట్ తీసుకు రాగలిగారు. ఆ దృశ్యాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ దృశ్యాల్లో ఉన్న జీవం అందర్నీ కట్టి పడేస్తున్నాయి. స్క్రిప్టెడ్ అయితే అలా ఉండవని.. షూట్ చేయడానికి కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు కానీ ఆ ఎమోషన్లు మాత్రం ఆర్గానిక్.
షెడ్యూల్ ముందే ఖరారు – కానీ ఫీడ్ బ్యాక్ తీసుకునేది చంద్రబాబే !
నాలుగోసారి చంద్రబాబు సీఎం అయ్యాక స్టైల్ మార్చారు. ప్రజల్లో ఉండేందుకు.. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలతో ఏదో విధంగా ఇంటరియాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి వద్ద నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుతో ఎవరు మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలని అధికారులు కొంత మందిని ఎంపిక చేయవచ్చు కానీ.. అలాంటి ట్రాప్ లో పడకుండా.. చంద్రబాబు కేవలం బ్యాక్ గ్రౌండ్ చెక్ మాత్రమే చేసి ప్రజలందర్నీ తనను కలిసే అవకాశం ఇప్పించేలా చేస్తున్నారు. ఓ వీధిలోకి వెళ్తే.. అక్కడ ఎవరితో మాట్లాడాలో చంద్రబాబు డిసైడ్ చేసుకుంటున్నారు. ఇలా పాలనపై ఫీడ్ బ్యాక్ ను బహిరంగంగానే తీసుకుంటున్నారు.
విమర్శించేవాళ్లు విమర్శిస్తూనే ఉంటారు !
చంద్రబాబు టూర్లు అన్నీ స్క్రిప్టెడ్ అని.. డ్రామా అని వైసీపీ సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆ ప్రోగ్రాం స్క్రిప్టెడ్ కావొచ్చుకానీ.. అక్కడే జరగాలన్నది కాదని.. చంద్రబాబే ప్రజలతో ఇంటరియాక్ట్ అవుతున్నారని చంద్రబాబు కార్యక్రమాలను పర్యవేక్షించేవారు చెబుతున్నారు. ఒక్కోసారి చంద్రబాబు నేరుగా ప్రజలతో రియాక్ట్ అవుతున్నారు. శనివారం ఓ వ్యక్తి ఫ్లెక్సీ పట్టుకుని కాన్వాయ్ కు అడ్డు వచ్చారు. కాన్వాయ్ ఆపి మరీ సమస్యను తెలుసుకున్నారు. ఇలాంటివి స్క్రిప్టులుగా చేయలేరు. అందుకే..చంద్రబాబు పర్యటనల్లో ఎమోషన్స్ అన్నీ ఆర్గానిక్ గా వైరల్ అవుతున్నాయి.