నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి ప్రధాన కారణం ఏంటి? రికార్డ్ స్థాయి మెజారిటీతో ఎన్టీఆర్‌ని తెలుగు ప్రజలు గెలిపించడానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల బానిస మనస్తత్వమే. అధిష్టానం పాదాల దగ్గర సాగిలపడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడమే. అలాంటి తెలుగు కాంగ్రెస్ నాయకులను చూసి ఉన్నది కాబట్టే ఎన్టీఆర్‌ని కూడా అదే కోవలో జమకట్టింది ఇందిరాగాంధీ. కానీ దమ్ము, ధైర్యం, తెగువ, ఆవేశం కలబోసిన వ్యక్తిత్వమున్న ఎన్టీఆర్….ఇందిరాగాంధీకి చుక్కుల చూపించాడు. తెలుగువాడి సత్తాను జాతీయ స్థాయిలో చాటాడు. కాంగ్రెస్ హటావో అని ఇప్పుడు నరేంద్రమోడీ కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా చేస్తున్న రాజకీయాల కంటే ఎక్కువే చేశాడు ఎన్టీఆర్. ఇప్పుడు రాహుల్ గాంధీలాంటి అసమర్థ రాజకీయ నాయకుడితో మోడీ ఎలాంటి రాజకీయాలు చేస్తున్నాడో……అప్పట్లో ప్రపంచ దేశాల అధ్యక్షులనే గడగడలాడించిన ఇందిరాగాంధీతో అదే స్థాయి రాజకీయాలు చేశాడు ఎన్టీఆర్. అదీ ఎన్టీఆర్ స్థాపించిన, ఎన్టీఆర్ అధ్యక్షుడిగా ఉన్న తెలుగు దేశం పార్టీ ఘన చరిత్ర.
కానీ ఇప్పుడు చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ పార్టీ స్థాపించకముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల స్థాయి బానిసత్వాన్ని మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తుచేస్తున్నాడు. ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా అత్యద్భుతం, పదిహేనేళ్ళు తీసుకుని వస్తా అన్న చంద్రబాబు….మోడీ ఏం మంత్రం వేశాడో? ఎలా భయపెట్టాడో తెలియదు కానీ ప్రత్యేక హోదా వేస్ట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించే ప్రయత్నాలను చేస్తున్నాడు. ప్యాకేజీని ప్రకటించిన మరుక్షణమే….ఆ ప్యాకేజ్ అద్భుతం అని చెప్పేశాడు చంద్రబాబు. ఇక తాజాగా అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం తర్వాత కూడా అదే స్థాయి నమ్మినబంటు రాజకీయం చేశాడు చంద్రబాబు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు నిర్ణయాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క నిర్ణయం కూడా నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకోలేదు. రెవిన్యూ లోటు బకాయిల ప్రస్తావనే లేదు, రాజధాని అభివృద్ధికి నిధులు, రాజధాని కనెక్టివిటీ ప్రాజెక్టులకు కేటాయింపులు, పెట్టుబడులపై పన్ను రాయితీల ప్రస్తావన ఏదీ బడ్జెట్లో లేదు. అద్భుతః అని చంద్రబాబు అనునిత్యం పొగుడుతున్న ప్యాకేజీ నిధుల ప్రస్తావన కూడా లేదు.
రైల్వే కథ కూడా సేం టు సేం. రైల్వే శాఖా మంత్రి సురేష్ ప్రభుని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తున్న సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు అన్నీ ఇన్నీ కాదు. కానీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ మంత్రిగారు చేసింది ఏమీ లేదు. విశాఖ రైల్వే జోన్ మాటే లేదు. అమరావతి ప్రాంతానికి కనెక్టివిటీ గురించి ప్రస్తావన లేదు. కొత్త లైన్లు లేవు. కొత్త రైళ్ళను ప్రకటించింది కూడా లేదు. ప్లాట్ ఫారాల అభివృద్ధి గురించి కూడా ఏమీ చెప్పలేదు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించింది శూన్యం.
ఇలాంటి బడ్జెట్ ప్రవేశ పెట్టిన టైంలో ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఉండి ఉంటే సినిమా మామూలుగా ఉండేది కాదు. టిడిపి అనుకూల మీడియా ఏ స్థాయిలో రెచ్చిపోయేదో కూడా ఊహించలేం. కానీ చంద్రబాబే ముఖ్యమంత్రి. అది కూడా బిజెపి ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ స్థాయిలో నరేంద్రమోడీకి నమ్మినబంటుగా ఉన్న ముఖ్యమంత్రి. అందుకే బంటు బాధ్యతను నిజాయితీగా నర్వర్తించాడు. బడ్జెట్‌ని ఎన్ని రకాలుగా పొగిడే ఛాన్స్ ఉందో….అన్ని రకాలుగానూ పొగిడేశాడు చంద్రబాబు. మోడీని ఆకాశానికెత్తేశాడు. భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పాడు. మరి రాష్ట్రం పరిస్థితేంటి అని ఆలోచించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ….1980లకు ముందు నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లాంటి నాయకుడు కాదు…..ఎన్టీఆర్‌లాంటి గట్స్ ఉన్న నాయకుడు కావాలని కోరుకుంటున్నారు.
ఈ బడ్జెట్ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మోడీతో కలిసి ఉన్నానని చంద్రబాబు చెప్పుకుంటే అంతకంటే ఆత్మవంచన లేదు. 2018 వరకూ అలాంటి మాయ మాటలే చెప్పి….ఆ తర్వాత….‘ నరేంద్రమోడీ నన్ను మోసం చేశాడు’….అని ఓటర్ల దగ్గరకు వెళ్ళి సానుభూతి రాజకీయాలు చేయడానికి చంద్రబాబుకి ఏమైనా ఉపయోగపడొచ్చేమో కానీ ఈ టెర్మ్‌కి మాత్రం మోడీ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. బీహార్‌కి ప్రకటించినట్టుగా 2019లో ఎన్నికల ప్యాకేజ్ ఏమైనా ప్రకటిస్తాడేమో చూడాలి.