సైక్లోన్ మొంథా తీరం దాటిపోయింది. కోస్తా జిల్లాలను అతలాకుతరం చేసింది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో నర్సాపురం వద్ద తీరం తాకిన మొంథా.. మెల్లగా దాటి వెళ్లిపోయింది. ఈ ప్రభావం మరో ఒకటి, రెండు రోజులు ఉంటుంది. వర్షాలు విస్తారంగా పడతాయి. అయితే ఇంత పెద్ద తుపాను వస్తే జరిగిన నష్టం మాత్రం పరిమితంగా ఉంది. ఒక్క ప్రాణం పోకుండా కాపాడుకున్నారు. ఆస్తుల నష్టం కూడా తగ్గింది. ఇక ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు కొన్ని రకాల నష్టాలను ఆపలేరు. ముందు జాగ్రత్తల వల్ల ప్రజల ఆస్తి నష్టాలను చాలా వరకూ తగ్గించగలిగారు. సహాయ చర్యలను .. తుపాను పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థరాత్రి వరకూ సమీక్షిస్తూనే ఉన్నారు. నారా లోకేష్ రాత్రంగా అందుబాటులో ఉన్నారు.
తీరం దాటిపోయి.. ముప్పు తప్పే వరకూ మెలకువగా చంద్రబాబు
పర్యవేక్షించేవారు లేకపోతే అధికారయంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు. అందుకే చంద్రబాబు తాను ఆర్టీజీఎస్ ద్వారా ప్రతీ సహాయ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తానన్న సంకేతం పంపారు. దాంతో అధికారులు ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా పని చేశారు. ప్రజలకు ఎక్కడ సాయం అవసరం అని సమాచారం వస్తే అక్కడకు క్షణాల్లో వెళ్లిపోయారు. వందల మందిని పునరావాస శిబిరాలకు పంపించారు. అసలు రిస్క్ తీసుకోవద్దని.. ప్రజల ప్రాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇచ్చారు. ప్రమాదకరమైన రహదారులపై వాహనాల రాకపోకలనూ అనుమతించలేదు.
నిద్రపోకుండా పని చేసిన అధికారులు
చంద్రబాబు నిద్రపోలేదు..అధికారుల్ని కూడా నిద్రపోనివ్వలేదు. ఫలానా ప్రాంతంలో అత్యవసరంగా అధికారుల సాయం అవసరం అనిపితే.. నిమిషాల్లో అక్కడికి చేరుకునేలా చూశారు. సహాయానికి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందన్న అంచనాలు రావడంతో.. ఆ విషయంలో మరింత పర్యవేక్షణ చేశారు. విజయవాడలో పడిన వర్షానికి బుడమేరు విషయంలో తప్పుడు ప్రచారం జరిగే అవకాశం ఉండటతో.. ప్రజలకు వాస్తవ సమాచారం చేరేలా ఏర్పాట్లు చేశారు.
ప్రచారం అనుకున్నా.. పని మానరు !
చంద్రబాబు నాయుడుకు పని ఇష్టం. ఇలాంటి సంక్షోభాలు వస్తే.. ఓవర్ టైం పని చేయడం ఇంకా ఇష్టం. దాని వల్ల ఆయనకు ప్రచారం వస్తుంది. ప్రచారం కోసమే పని చేస్తున్నారని విమర్శించేవాళ్లు ఉంటారు. వాళ్లు విమర్శిస్తారని చంద్రబాబు పని చేయకుండా ఇంట్లో పడుకోలేరు. ఒక వేళ ఆయన అదే పని చేస్తే .. ప్రజల్ని పట్టించుకోలేదని వాళ్లే అంటారు. అందుకే అనేవాళ్లు అంటూనే ఉంటారు. కానీ చంద్రబాబు మాత్రం.. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ప్రజలిచ్చిన బాధ్యతను.. బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు.
