రాజకీయ నాయకుల వ్యవహార శైలి అయితే అలాగే ఉంటుంది. ఎక్కడో బల్బ్ వెలగడానికి ఇంకెక్కడో స్విచ్ అరేంజ్ చేసే బాపతు జనాలే ఎక్కువ. సమయం సందర్భం లేకుండా మాట్లాడుతూ ఉంటారు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ మాటలతో మాయ చేసే విషయంలో మన నాయకులను కొట్టేవాడు ప్రపంచంలోనే ఉండడు. సగం ఓట్లను మాటలతోనే గెల్చుకోగల సమర్థులు మన నాయకులు. 2014లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, టిడిపి అధికారంలోకి రావడానికి ఎంతో కొంత కారణమైన పవన్ కళ్యాణ్ 2019లో మాత్రం టిడిపికి వ్యతిరేకంగా బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. బిజెపితో పొత్తు ఉన్నప్పటికీ, చాలా విషయాల్లో ఆ పార్టీని కార్నర్ చేస్తూ ఉన్న టిడిపి అండ్ అనుకూల మీడియా సంస్థలు గత కొంత కాలం నుంచి పవన్ విషయంలో కూడా కొంచెం ఘాటుగానే స్పందిస్తూ ఉన్నాయి.
ఈ రోజు కొత్త సచివాలయంలో, కొంగొత్తగా అడుగెట్టిన చంద్రబాబునాయుడు పెళ్ళిళ్ళ గురించి, భార్యల గురించి తనకు తానుగానే ప్రస్తావన తీసుకొచ్చారు. అమెరికాలో పెళ్ళిళ్ళు చేసుకుంటారని, ట్రంప్‌కి కూడా ఇప్పుడున్నది నాలుగో భార్య అనుకుంటా అని సందర్భం లేకుండా పెళ్ళి గురించి, నైతికి విలువల గురించి, కుటంబ సంబంధాల గురించి చాలా చాలా మాట్లాడేశారు చంద్రబాబునాయుడు. ఆయన మాట్లాడింది ట్రంప్ గురించే అయినప్పటికీ, ఆ మాటలు మన తెలుగు రాజకీయ నాయకులలో ఎవరికి తగులుతాయో తెలియనంత అమాయకుడైతే చంద్రబాబునాయుడు కాదు. తాను మరోసారి ముఖ్యమంత్రి అవడానికి ప్రధాన కారణాల్లో ఒకరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడన్న విషయం చంద్రబాబుకు తెలియకుండా ఉండే అవకాశం అయితే అస్సలు లేదు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఓ విమర్శకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేశాడు. ఇక ఇప్పటి నుంచి టిడిపి నాయకులు, ఆ పార్టీ అనుకూల మీడియా సంస్థలు కలిసి ఈ ‘పెళ్ళిళ్ళ’ సినిమాని ఎంత వరకూ తీసుకెళతాయో చూడాలి మరి.