తెలంగాణలో జూబ్లిహిల్స్ ఉపఎన్ని, అలాగే స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ సమయంలో తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుతో సమావేశం అవుతున్నారు. చంద్రబాబు వారితో మంగళవారం సాయంత్రం చర్చించనున్నారు. ఏం చేయాలన్నదానిపై చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
అయితే ఎన్నికల్లో పోటీ చేయడం అనేది మాత్రం ఉండదని తెలంగాణ టీడీపీ నేతలు నమ్ముతున్నారు. జూబ్లిహిల్స్ లో బీజేపీ పోటీ చేస్తుంది కాబట్టి సహజంగానే ఆ పార్టీకి మద్దతు ఇస్తారు. స్థానిక ఎన్నికల వరకూ బీజేపీతో కలిసి పోటీ చేస్తారా లేదా అసలు పోటీ చేయకుండా ఉండటమా అన్నది చంద్రబాబు సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం కర్టెసీ మీటింగేనని.. కీలకమైన నిర్ణయాలు తీసుకునేది ఉండదని అంటున్నారు.
చంద్రబాబునాయుడు తెలంగాణలో టీడీపీపై ఇంకా దృష్టి సారించలేదు. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసిన తర్వాత కనీసం అధ్యక్షుడ్ని నియమించలేదు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఆ పార్టీని వదలకుండా…. మీడియాలోనూ.. అక్కడక్కడ క్షేత్ర స్థాయిలో పని చేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ పరంగా జరగవు కాబట్టి టీడీపీ నేతలుగా ఉన్న వారు పోటీ చేసుకుంటారు. అయితే పార్టీ తరపున అధికారికంగా కాదు.