పీ4 పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేటి నుండి ప్రారంభిస్తున్నారు. నిజానికి ఇది పథకం కాదు. ప్రభుత్వం పైసా ఖర్చు పెట్టదు. కేవలం దాతలు, పేదల మధ్య ఓ అనుసంధాన కర్తగా మాత్రమే ఉంటుంది. ఈ పథకంపై చంద్రబాబుకు ఓ విజన్ ఉంది. డబ్బులు ఉన్న వాళ్లు, జ్ఞానం ఉన్న వాళ్లు, సమాజ సేవలపై ఆసక్తి ఉన్న వాళ్ల సాయంతో.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి పోతున్న వారికి చేయూత అందించేందుకు ఈ ఆలోచన చేశారు. ఈ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అర్థమైనవారికి అద్భుతంగా ఉంటుంది. ఒక వైపే ఆలోచించే వారికి సమస్యగా ఉంటుంది. అయితే ఇలాంటి కార్యక్రమాల్లో బలవంతంగా ఎవరితోనూ పనులు చేయించలేరు. సాయం చేయించలేరు. బలవంతంగా చేయించాలని ప్రభుత్వం అనుకుంటే మాత్రం విఫలం అవుతుంది.
పేదలకు చేయూత అవసరం
పేదరికం అనేది స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఉందంటే దానికి కారణం కేవలం అజ్ఞానమే. చదువుకున్న వారు కూడా పేదరికంలో ఉండటం సమాజానికి మంచిది కాదు. ఇలాంటి వారు ఎదగలేకపోవడానికి కారణం సరైన మార్గనిర్దేశకత్వం.. చేయందించేవారు లేకపోవడం కారణం. చాలా కుటుంబాలు బాగుపడటానికి డబ్బులు అవసరం లేదు. కొన్ని అవకాశాలు లేదా మార్గనిర్దేశకత్వం చాలు. ఇలాంటి కుటుంబాలను ప్రభుత్వం గుర్తించింది. పేదరికానికి కారణాలను అన్వేషించింది. వారికి ఏ రూపంలో సాయం కావాలో కూడా లిస్టవుట్ చేసింది. ఇప్పుడు ఆ పేదలకు ఓ అవకాశం ఇచ్చేందుకు సిద్ధమయింది.
కాన్సెప్ట్‌ను పేద కుటుంబాలు కూడా అర్థం చేసుకోవాలి !
పేద ప్రజలు పేదలు, పనులు లేకుండా ఉండటానికి.. ఎదిగేందుకు ప్రయత్నం చేయకపోవడానికి కారణం కూడా రాజకీయాలే. ఓట్ల కోసం ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడి కనీస అవసరాలు ఇంటికే పంపిస్తున్న తరుణంలో వారికి పని చేయాల్సిన అవసరం ఏమిటో కనిపించడం లేదు. తిండి దొరికితే చాలనుకుంటున్నారు. అలాంటి వారి మైండ్ సెట్ మార్చాల్సి ఉంది. ప్రపంచంతో పాటు ముందుకు సాగాలంటే.. ప్రభుత్వాల నుంచి వచ్చేది కాదు.. సొంతంగా ఎదగాలని నేర్పించాలి. అందు కోసం సాయం చేస్తున్నామని మోటివేట్ చేయాలి. వారికి కూడా ఈ పీ ఫోర్ పై స్పష్టమైన అవగాహన కల్పించి ఉంటేనే .. ఈ పథకం ప్రయోజనం వల్ల లబ్ది కలుగుతుంది.
బలవంతంగా సేవ చేయించలేరు !
P4 అమలుపై టీడీపీ వర్గాల్లోనూ వ్యతిరేకత ఉంది. పేదరికాన్ని నిర్మూలించాలని చంద్రబాబు అంటున్నారని .. ఆయన నేల మీద నడవడం లేదని అంటున్నారు. ఇలా పేదల్ని ఎంపిక చేసి సాయం చేయడం వల్ల ఇతరులుక కోపం వస్తుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. చాలా మంది బలవంతంగా మార్గదర్శుల్ని ఎంపిక చేస్తున్నారని అంటున్నారు. నిజానికి ఇవేమీ తీసి పడేయాల్సిన ఫీడ్ బ్యాక్ కాదు. సేవ స్వచ్చందంగా చేయాలి కానీ.. బలవంతంగా చేయిస్తే అది ఎప్పటికీ విజయవంతం కాదు. మార్గదర్శుల ఎంపికలో బలవంతం ఉంటే.. పీఫోర్ వంద శాతం ఫెయిలవుతుంది. అలాగే.. పథకం లబ్దిదారులకు అవగాహన లేకపోయినా.. సమస్య వస్తుంది. కానీ పీ4 పథకాన్ని సద్వినియోగం చేసుకునే కుటుంబాలు మాత్రం.. పేదరికంపై యుద్ధంలో గెలవడం చాలా సులువు.