ఏపీ సీఎం చంద్రబాబు .. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. నాలుగైదు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు పవన్ కల్యాణ్. ఆయన వైద్య పరీక్షల కోసం మంగళగిరి నుంచి హైదరాబాద్ వచ్చారు. ఇంట్లోనే వైద్యం తీసుకుంటున్నారు. ఆయనను పరామర్శించేందుకు చంద్రబాబు జూబ్లిహిల్స్‌లోని పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు.
అనారోగ్యంతో ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ చంద్రబాబుకు గేటు వద్దకు వచ్చి స్వాగతం పలికారు. చంద్రబాబు ఒక్కరే వచ్చారు. ఆయన వెంట ఇతర నేతలెవరూ రాలేదు. ఇటీవల బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో పవన్ నొచ్చుకుని ఉంటారని ప్రచారం జరుగుతున్న సమయంలో పరామర్శకు పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లడం రాజకీయంగా ఆసక్తి వ్యక్తమవుతోంది.
కామినేని శ్రీనివాస్ అన్న మాటల్ని, బాలకృష్ణ మాటల్ని కూడా రికార్డుల నుంచి తొలగించారు. ఆ అంశం రాజకీయం కాకుండా రెండు పార్టీలు సంయమనం పాటిస్తున్నాయి. అయితే చంద్రబాబు పరామర్శలో అలాంటి విషయాలు చర్చించలేదని.. పూర్తిగా ఆరోగ్యం గురించే వాకబు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.