సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నారా లోకేష్ ఏపీ అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలి పెట్టడం లేదు. తాజాగా ఒక పంజాబీ యాత్రికుడికి ఆయన ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు ఎక్స్ లో వైరల్ అవుతోంది.
పంజాబ్‌కు చెందిన ప్రముఖ సాహస యాత్రికుడు రతన్ థిల్లాన్ తన బృందంతో కలిసి పంజాబ్‌లోని మారుమూల ప్రాంతాలను అన్వేషిస్తూ, పర్యాటక శాఖకు కూడా తెలియని ఎన్నో ప్రదేశాలను మేము గుర్తించాం. పంజాబ్ టూరిజం మాకు సహకరిస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీనిపై లోకేష్ తక్షణమే స్పందించారు.
రతన్ థిల్లాన్ చూపిన ఆ సాహస స్ఫూర్తిని అభినందిస్తూనే, లోకేష్ ఆ బృందాన్ని సాదరంగా ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించారు. రతన్.. మీ సాహసయాత్ర అద్భుతం. ఆంధ్రప్రదేశ్‌లోని అందాలు, సంస్కృతి , రుచులను అన్వేషించడానికి నేను మిమ్మల్ని, మీ బృందాన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఏపీని అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంలో మనమంతా కలిసి పనిచేద్దాం అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, ఆ బృందానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులను ఆయన అక్కడికక్కడే ఆదేశించారు.
లోకేష్ ఆహ్వానానికి రతన్ థిల్లాన్ కూడా అంతే ఉత్సాహంగా స్పందించారు. ధన్యవాదాలు సార్! తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌ను అన్వేషిస్తాం. భారతదేశం నిజంగా అద్భుతమైన దేశం.. మనం దాన్ని ఇంకా ఎంతో చూడాల్సి ఉంది అంటూ బదులిచ్చారు. పక్క రాష్ట్రాల్లో అవకాశాల కోసం ఎదురుచూసే ప్రతిభను గుర్తించి, వారిని మన రాష్ట్ర పర్యాటక ప్రచారానికి వాడుకోవడంలో లోకేష్ చూపిన చొరవను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


