ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కష్టించి పని చేస్తారు. హార్డ్ వర్క్ చేస్తారు.. స్మార్ట్ వర్క్ చేస్తారు.తన ఘనతల్ని చెప్పుకోవడానికి ఆయన ఏ మాత్రం సంకోచించరు. ఇది మొదటి నుంచి ఆయన పబ్లిసిటీ స్ట్రాటజీనే. కానీ మారుతున్న కాలం కొద్దీ మారాల్సి ఉంది. ప్రజల్లో ఎక్కువగా చర్చ జరిగి.. ప్రభావితమయ్యే అంశాలపైనే ఎక్కువగా చర్చ జరిగి.. మిగతా విషయాల్లో ఎక్కువగా ఫలితాలపైనే ప్రచారం జరిగేలా చూసుకోవాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ ఈ విషయంలో చంద్రబాబు గతంలో చేసిన వ్యూహాత్మక తప్పిదాలనే రిపీట్ చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రజల్లో ఎక్కువగా చర్చ పెట్టాల్సింది.. సంక్షేమం, అభివృద్ధి పైన !
ప్రభుత్వ పరిపాలన అనేక రూపాల్లో ఉంటుంది. కొన్ని రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. మరికొన్ని రంగాలకు.. కొంత ప్రాధాన్యత తగ్గిస్తారు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని చేసే నిర్ణయాల విషయంలో మొదట్లో భవిష్యత్ గురించి మనకెందుకు అన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే ఇలాంటి నిర్ణయాల గురించి ఎక్కువ చర్చ జరగకుండా చూసుకోవాలి. ప్రజల్లో ఎప్పటికప్పుడు చర్చ జరగాల్సింది.. సంక్షేమం, అభివృద్ధిపైనే. తల్లికి వందనం పథకాన్ని సంతృప్త స్థాయిలో అమలు చేశారు. దానికి తగ్గట్లుగా ప్రచారం చేసుకున్నారా లేదా అన్నది టీడీపీ రివ్యూ చేసుకోవాల్సి ఉంది. అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రచారం చేసుకోలేకపోతున్నారు.
అభివృద్ధిపైనే చర్చ ఏది ?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏపీలో పరిస్థితులు మారిపోయాయి. ఐదు సంవత్సరాల పాటు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన మౌలిక సదుపాయాలు చాలా వరకూ మెరుగుపడ్డాయి. రోడ్లన్నీ బాగుపడ్డాయి. అనేక చోట్ల ఏళ్ల తరబడి ప్రతిపాదనల దశలోనే ఉన్న రోడ్లు నిర్మించారు. కరెంట్, నీళ్ల సమస్యలు కనిపించడం లేదు. సాధారణంగా చర్చించుకోవాల్సింది ఇలాంటివే. ఎందుకంటే.. పడిన ఇబ్బందులు పరిష్కారం అయిన తర్వాత ప్రజలు మర్చిపోతారు. ఇలాంటివి గుర్తు చేసుకోవాల్సిన ఉంటుంది.
క్వాంటమ్ లాంటివాటిపై ప్రచారం తక్కువ..ఫలితాలు ఎక్కువ ఉండాలి !
క్వాంటం కంప్యూటింగ్ పై రెండు రోజుల నుంచి విస్తృత ప్రచారం జరుగుతోంది. విద్యాధికుల్లో దీనిపై ఆసక్తి ఉంటుంది.కానీ సామాన్య ప్రజలకు అవసరం లేదు. ఇలాంటివి భావితరం రాతల్ని మార్చేస్తాయి. క్వాంటం వ్యాలీ అమరావతిలో డెవలప్ అయితే తిరుగు ఉండదు. కానీ ఇవన్నీ ఆకాశానికి నిచ్చెనలు వేయడమని.. సామాన్యుల భావన. ఇలాంటి వాటిలో ఫలితాలే మాట్లాడాలి కానీ.. ప్రారంభంలోనే హైప్ పెంచేసి ప్రచారం చేసుకోవడం వల్ల నెగెటివిటీ పెరుగుతుంది.
చంద్రబాబు సంక్షేమానికి, అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఎక్కువగా ఐటీ, ఏఐ, క్వాంటం గురించి మాట్లాడుతూంటారు. తక్కువే మాట్లాడినా వాటి గురించే ఎక్కువ ప్రజల్లో చర్చ జరుగుతుంది. అందుకే ప్రచార స్టైల్‌ను.. ఫలితాలు మాట్లాడాల్సిన పనులను విభజించుకుని ప్రచార స్ట్రాటజీ రూపొందించుకోవాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.