తెలుగు రాష్ట్రాల మధ్య జల వనరుల వినియోగం విషయంలో విద్వేషాలు పక్కన పెట్టి, సయోధ్యతో ముందుకు వెళితేనే ఇరు రాష్ట్రాలకు ప్రయోజనమనే పాలసీని చంద్రబాబు పాటిస్తున్నారు. తెలంగాణలో నీటి రాజకీయాల కోసం దిగువ రాష్ట్రం అయిన ఏపీని బూచిగా చూపించి చేస్తున్న రాజకీయాలు, అగ్రనేతలు చేస్తున్న ప్రకటనలపై చంద్రబాబు స్పందించారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో మాట్లాడిన ఆయన జల రాజకీయాల వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించారు.
ఏటా వేలాది టీఎంసీల గోదావరి, కృష్ణా జలాలు సముద్రంలో వృథాగా కలిసిపోతున్నాయని .. నదీ జలాల వినియోగం విషయంలో తెలుగువారంతా ఐక్యంగా ఉండాలని, గొడవలు పడటం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏనాడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. ఎందుకంటే గోదావరి నీరు వాడుకుంటే తెలుగు వారికే మేలు జరుగుతుందని భావించానన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజన తర్వాత కూడా తాము చేపట్టిన పట్టిసీమ, పోలవరం వంటి ప్రాజెక్టులు మరియు తెలంగాణలో పూర్తి చేసిన సాగునీటి పథకాలను గుర్తు చేస్తూ, నీటిని పొదుపుగా వాడుకుంటూ రెండు రాష్ట్రాలూ సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య ఉంటేనే భవిష్యత్తులో తెలుగు జాతి ప్రపంచస్థాయిలో శక్తివంతంగా తయారవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నీటి సమస్యలు తీరాలంటే నదుల అనుసంధానం జరగాలన్నది తన చిరకాల వాంఛ అని చెప్పారు. 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండాలని, ఆ దిశగా విద్వేషాలకు తావు లేకుండా అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాలని ఆయన సూచించారు.
తెలంగాణను బూచిగా చూపి ఏపీలోనూ భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేసే అవకాశం ఉన్నా.. చంద్రబాబు… నీటి విషయంలో రాజకీయాలు రాష్ట్రాలకు మంచిది కాదని భావిస్తున్నారు.
