తుపాను తీరం దాటే వరకూ రియల్ టైమ్లో అధికారుల్ని, యంత్రాంగాన్ని పర్యవేక్షించిన చంద్రబాబు. తుపాను తీరం దాటి వెళ్లిపోయిన వెంటనే ఫీల్డులోకి వెళ్లిపోయారు. తీవ్రంగా వర్షం ద్వారా ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. తర్వాత కోనసీమ జిల్లాలో పునరావాస కేంద్రాలకు వెళ్లారు. అక్కడ ఉన్న ముంపు బాధితుల్ని పరామర్శించారు. వారికి అందుతున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు.
చంద్రబాబు పర్యటన గురించి ముందుగా ఎవరికీ సమాచారం లేదు. హఠాత్తుగా ఆయన ఏరియల్ సర్వే పెట్టుకుని కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవుకు వెళ్లారు. దీంతో అధికారులు చేసిన ఏర్పాట్లు ఎలాంటివో .. అంచనా వేయగలిగారు. అక్కడకు సీఎం వస్తారని తెలిస్తే వేరే ఏర్పాట్లు చేసి ఉండేవారు. అయితే సీఎం వస్తారని కాకుండా అందరికీ కనీస సౌకర్యాలతో సరైన ఏర్పాట్లు చేశారా లేదా అన్నది ముఖ్యం. చంద్రబాబు పర్యటనతో అధికారులు హడావుడి పడ్డారు. ఇంకా వర్షాలు పడుతూనే ఉండటం దీనికి కారణం.
వర్షాలు పడుతూనే ఉన్నా.. హెలికాఫ్టర్ పర్యటన అంత మంచిది కాదని చెప్పినా చంద్రబాబు క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లారు. అంతకు ముందు ఉదయమే.. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తీవ్ర తుఫాన్ వచ్చినా.. ప్రాణనష్టం లేకుండా చూశామన్నారు. తుపాన్ ప్రభావం తీవ్రంగానే ఉందని.. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని అంచనాలు సిద్దం చేయాలని ఆదేశించారు. మరో బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేయాలని ఆదేశారు. ఒక్కొక్కరికి మూడు వేలు ఇవ్వాలని జీవో ఇచ్చారు.
