బాబ్లీ కేసును వాయిదా వేసిన ధర్మాబాద్ కోర్టు!

బాబ్లీ వివాదానికి సంబంధించిన కేసులో రీకాల్ పిటీష‌న్ ను ధ‌ర్మాబాద్‌ కోర్టు విచార‌ణ‌కు అనుమ‌తించింది. తదుప‌రి విచార‌ణ‌ను న‌వంబ‌ర్ 1కి వాయిదా వేసింది. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌ర‌ఫున న్యాయ‌వాది సుబ్బారావు కోర్టులో వాద‌న‌లు వినిపించారు. దాదాపు ప‌దేళ్ల కింద‌ట బాబ్లీ ప్రాజెక్టు స‌మీపంలో టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుతో స‌హా కొంత‌మంది నేత‌లు ఆందోళన‌కు సంబంధించిన కేసు ఇది అనే సంగ‌తి తెలిసిందే. నిజానికి, దీన్ని ఒక చిన్న‌ కేసుగా టీడీపీ నేత‌లు చూస్తున్నారు. అయితే, కోర్టు ఈ కేసును ఇప్పుడు సీరియ‌స్ గానే తీసుకుందనే కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన అంద‌రి వివ‌రాలూ, బ‌యోడేటాలు, తాజా వివ‌రాల‌ను స‌మ‌ర్పించాలంటూ పోలీసుల్ని కోర్టు ఆదేశించిట్టు స‌మాచారం.

ఎనిమిదేళ్ల కింద‌ట ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న స‌మ‌యంలో పోలీసులు హ‌డావుడిగా ఆతృత‌గా వ్య‌వ‌హ‌రించార‌నీ, నాడు కేసులు న‌మోదు చేస్తున్న సంద‌ర్భంలో వివ‌రాల‌ను స‌రిగా న‌మోదు చేయ‌లేద‌నీ అంటున్నారు! నిజానికి, బాబ్లీ ప్రాజెక్టు ముందు నిర‌స‌న జ‌రిగిన స‌మ‌యంలో హ‌డావుడి ఓ హెలీకాప్ట‌ర్ తీసుకొచ్చి, అక్క‌డి నుంచి చంద్ర‌బాబు నాయుడుని హైద‌రాబాద్ కి త‌ర‌లించారు. ఆ త‌రువాత‌, ఎలాంటి కేసూ లేద‌ని కూడా మొద‌ట్లో అన్నారు! అయితే, 2010 దాఖ‌లైన ఈ కేసు ఇప్పుడు తాజాగా తెర మీదికి వ‌చ్చింది.

అప్పుడు న‌మోదు చేసిన 16 మంది వివ‌రాల్లో చాలా త‌ప్పులు న‌మోదు చేశార‌ట‌! వీరిలో ఒక‌రి అడ్ర‌స్ వివ‌రాల‌తో రాష్ట్రంలో ఎక్క‌డా అలాంటి ప్రాంత‌మే లేద‌ట‌! వీరిలో మ‌రొక‌రి పేరు ఎవ్వ‌రికీ తెలీద‌ట‌! ఆయ‌న ఎవ‌రో తెలీదు, ఆయ‌న ఏ ప్రాంతానికి చెందిన‌వారో అనే వివ‌రాలు కూడా త‌ప్పుడుగా ఉన్న‌ట్టు స‌మాచారం. ఆంధ్రాకి చెందిన‌వారికి తెలంగాణ అడ్ర‌స్ లు, తెలంగాణ వారికి ఆంధ్రా అడ్ర‌స్ లు రాసి… ఒక‌రి ఇంటిపేర్ల‌తో మ‌రొక‌రు.. ఇలా అస్తవ్య‌స్తంగా వివ‌రాలు న‌మోదు చేశార‌ని అంటున్నారు. వివ‌రాలు ఇలా త‌ప్పుగా న‌మోదు చేసుకుని.. ఆయా చిరునామాల‌కు నోటీసులు పంపినా స్పందించ‌లేద‌ని త‌మ‌పై అభియోగాలు మోపితే ఎలా అని కూడా కొంద‌రు ప్ర‌శ్నించారు. దీంతో వీరి పూర్తి వివ‌రాల‌ను తీసుకోవాలంటూ కోర్టు ఇప్పుడు ఆదేశించింద‌ని చెబుతున్నారు. అంటే, కేసు న‌మోదు స‌మ‌యంలో దీన్ని ఒక చాలా చిన్న ఘ‌ట‌న‌గానే పోలీసులు భావించ‌డం వ‌ల్ల‌నే వివ‌రాల సేక‌ర‌ణ‌లో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌లేద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఏదేమైనా, ఇన్నేళ్ల తరువాత ఈ కేసుకు ప్రాధాన్యత పెరగడం వెనక రాజకీయ కారణాలను కూడా కాదనలేమనే విమర్శలు ఇప్పటికే గుప్పుమంటున్న సంగతి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com