పరకామణి కేసు చిన్నది అంటూ వ్యాఖ్యలు చేసిన జగన్ రెడ్డి వ్యవహారంపై చంద్రబాబు సెటైర్లు వేశారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బాబాయ్ హత్యకేసే చిన్నది అయినప్పుడు పరకామణి కేసు పెద్దదవుతుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ రెడ్డి తీరు ఉందన్నారు. బాబాయ్ హత్య కేసును సెటిల్ చేయాలనుకున్నట్లుగానే పరకామణి చోరీ కేసునూా సెటిల్ చేయాలని చూశారని విమర్శించారు.
చోరీ చేసిన వ్యక్తి డబ్బులు కట్టాడు కదా ఇంక కేసులెందుకని జగన్ అనైతికంగా వాదిస్తున్నాడని.. సెంటిమెంట్ విషయాల్లో సెటిల్మెంట్లు చేసి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. దొంగతనాన్ని కూడా తప్పుకాదనేవారిని ఏమనాలని చంద్రబాబు ప్రశ్నించారు. సున్నిత అంశాలను సెటిల్ చేశామని తేలికగా మాట్లాడుతున్నారని.. కానుకలు, భక్తులు హుండీలో వేసిన సొమ్మును చోరీ చేసిన దొంగతో సెటిల్మెంట్ ఏంటని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జగన్కు దేవుడు, ఆలయాల పవిత్రత అంటే లెక్కేలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వైసీపీ హయాంలో నేరస్తుల్ని పెంచి పోషించారని.. వారి తీరు వల్లనే మహిళలు డాన్లుగా ఎదిగారన్నారు. లేడీ డాన్లు పెరిగి పోయారని.. వారి తోకలు కట్ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రౌడీ షీటర్లు లేకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తెలంగాణ సమ్మిట్ కి వెళ్లే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
