పుష్కర జలాల కాలుష్యం: చంద్రబాబు నిర్ణయమే కీలకం!

స్నానఘట్టాలవద్ద గోదావరినీళ్ళు చిక్కబడుతున్నాయి. రంగుమారుతున్నాయి. మురికిబారుతున్నాయి. యాత్రీకుల సమస్యలను వెంటవెంటనే పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఈ సమస్యను హాండిల్ చేసే పరిస్ధితిలో లేదు. ఉపనది సీలేరే ఇపుడు గోదావరి నీటిని మెట్లవరకూ తీసుకు వస్తోంది. సీలేరునుంచి మరి కొంత నీరు విడుదల చేస్తే విద్యుత్ ఉత్పాదన బాగా పడిపోతుంది. రెండో పంటఎండిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.

జూలై, ఆగష్టు నెలలు గోదావరికి వరదకాలం. 2003 పుష్కరాల్లో నది నిండుగా ప్రవహించి దాదాపు సగం మెట్లు మునగడం వల్ల యాత్రీకులు సౌకర్యంగా, తాజా నీటితో పుణ్యస్నానాలు చేశారు. ఈ సారి పుష్కరాలకు పదిరోజులముందే వరదవచ్చింది. అప్పటికి ఘాట్లపనులు పూర్తికాకపోవడం వల్ల మొత్తం 175 బ్యారేజి తలుపులనీ ఎత్తేసి వచ్చిన నీటిని వచ్చినట్టే సముద్రంలోకి వదిలేశారు. దీంతో పుష్కరాలనాటికి గోదావరి ఘాట్ల చెవరి మెట్టుకంటే వెనక్కి వెళ్ళిపోయింది. ఆసమయంలో సీలేరు నుంచి సెకెనుకి 15 వేలఘనపుటడుగుల(15 వేల క్యుసెక్కులు) చొప్పున నీరు విడుదలయ్యేలా సీలేరు రిజర్వాయుర్ తలుపులు తెరిచారు. పుష్కరాలు అయ్యే వరకూ సీలేరు నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు వస్తుందని అంతకంటే హెచ్చు నీరు తెచ్చికోవడం సమస్యాత్మకం కావచ్చనీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.

ధవిళేశ్వరం బేరేజి తలుపులు పూర్తిగా మూసివేస్తే రాజమండ్రి, ఎగువ ప్రాంతాల్లో ఘాట్ల వద్ద నీటి మట్టం పెరుగుతుంది. అయితే బ్యారేజి దిగువ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో స్నాన ఘట్టాలకు నీరు వుండదు. ఇందువల్ల బేరేజికి ఎగువవున్న ఘట్టాలకు, దిగువ వున్న ఘట్టాలకూ నీటి సమస్యరాకుండా కొద్దికొద్దిగా నీరు దుగువకు వదులుతున్నారు. పూజాద్రవ్యాలు విపరీతంగా నీటిలో వచ్చి చేరడం వల్లా, ప్రవాహవేగం తగ్గతూండటం వల్లా ఘాట్ల వద్ద గోదావరి నీరు మురికిబారుతోంది.

ఈ సీజన్ లో సీలేరులోకి చేరేనీరును తలుపులు తీయకుండా బొట్టుబొట్టునీ దాచినట్టు రిజర్వాయిర్ లో బంధించి వుంచుతారు. అదే వేసవిలో గోదావరి డేల్టాలలో కనీసం మూడులక్షల ఎకరాల్లో రెండో పంటకు నీరు ఇస్తుంది. 460 మెగావాట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేస్తుంది. సీలేరు రిజర్వాయిర్ ను మూసివుంచిన కాలంలో విద్యుత్ ఉత్పాదన కోసం టర్బైన్లను తిప్పి బయటకు వచ్చే 4500 క్యూసెక్కుల నీరు మాత్రమే దిగువకు వస్తుంది.

సెంటిమెంటుని దృష్టిలో వుంచుకుని పుష్కరస్నానాలకోసం దాచివుంచిన జలనిధుల నుంచి 11500 క్యూసెక్కుల నీరు విడుదల చేయడమే ఎక్కువ. ఇందువల్ల ఇప్పటికే ఒక కోటి యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని త్యాగం చేసుకున్నామనీ అధికారవర్దాల ద్వారా తెలిసింది. చిక్కబడుతున్న మురికి నీటిని ఫోర్స్ తో నెట్టెయ్యడానికి మరికొంత సీలేరు నీటిని తెస్తే భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి, రబీసాగు తీవ్రమైన సంక్షోభంలో పడిపోతాయని జలవనరుల శాఖమంత్రికి అధికారులు వివరించారు.

ఎలాగూ ఎనిమిది రోజులు గడిచాయి. మరో నాలుగురోజులు పరిస్ధితి ఇలాగే వున్నా ఫరవాలేదు. ఇంతకంటే నీరు కలుషితమైతే మరింత అదనపు నీటికోసం ముఖ్యమంత్రి ఆదేశించే అవకాశం వుంది అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు.

అయితే వైద్య ఆరోగ్యశాఖ నివేదికను బట్టే అదనపు నీరు అవసరమా అని నిర్ణయించే అవకాశం వుంది. ఇంతవరకూ దాదాపు 50 వేలమంది పుష్కరఘాట్ల వద్ద హెల్త్ క్లినిక్స్ లో చూపించుకున్నారు. వారిలో రకరకాల ఎలర్జీల సమస్యతో వచ్చినవారు నాలుగు వేలకంటే తక్కువమందేనని ఆశాఖ అధికారి డాక్టర్ లలిత చెప్పారు.” ఇవి ప్రమాదకరమైనవి కాదు. కొన్ని గంటల అసౌకర్యమే తప్ప ఆందోళన పడే సమస్యలు కాదు” అని ఆమె చెప్పారు.

ఇంకా ముగియని వర్షాకాలం మీద ఆశలు పెట్టుకుని మరి కొంత సీలేరు నీరు తెచ్చుకోవడమా…భవిష్యత్తు అవసరాలకోసం మిగిలిన నాలుగు రోజులూ మౌనంగా వుండిపోవడమా అని నిర్ణయించడం అధికారులకు తాడుమీద నడకే. ఇది ముఖ్యమంత్రి మాత్రమే తీసుకోవలసిన నిర్ణయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com