నేను ఏది ఆలోచించినా మెగాస్కేల్లో ఆలోచిస్తానని చంద్రబాబు కాగ్నిజెంట్ సంస్థ శంకుస్థాపన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. నిజంగానే ఆయన ఆలోచనలు ఆ స్థాయిలో ఉంటాయని కాసేపటికి అందరికీ అర్థమయింది. విశాఖ ఎకనామిక్ రీజియన్ పేరుతో 9 జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికల్ని ఆవిష్కరించారు. ప్రత్యేకంగా ప్రాజెక్టుల పరిశీలన చేశారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులతో విశాఖలో సమావేశమయ్యారు. అక్కడ విశాఖ ఎకనామిక్ రీజియన్ గురించి తన విజన్ వెల్లడించారు. వాటి అమలుకు కార్యాచరణ కూడా వివరించారు.
విశాఖ ఎకనామిక్ రీజియన్లో మొత్తం 9 జిల్లాలు
విశాఖను కేంద్రంగా చేసుకుని చుట్టూ ఉన్న తొమ్మిది జిల్లాలను అభివృద్ధి చేసేలా ఎకనమిక్ రీజియన్ ఖరారు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఈ జిల్లాల్లో ప్రస్తుతం 1.65 కోట్ల జనాభా ఉంటుంది. 38,000 చదరపు కి.మీ విస్తీర్ణం, 52 బిలియన్ డాలర్ల జీడీపీ, 3,170 డాలర్ల తలసరి ఆదాయం, 70 లక్షల వర్క్ ఫోర్స్ ఉంటుందని లెక్కలు వేశారు. ఏపీలో వీఈఆర్ భాగస్వామ్యం… 31 శాతం భౌగోళిక విస్తీర్ణం, 23 శాతం జనాభా, 30 శాతం జీడీపీ ఉంటంది.
7 గ్రోత్ డ్రైవర్ల ద్వారా అభివృద్ధి
ఈ తొమ్మిది జిల్లాల విశాఖ ఎకనమిక్ రీజియన్ ను 7 గ్రోత్ డ్రైవర్ల ద్వారా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రెడీ చేుకున్నారు. గ్లోబల్ పోర్ట్, నెక్ట్స్ జెన్ ఐటీ, అగ్రికల్చర్, టూరిజం, హెల్త్ కేర్ హబ్, ప్లాన్డ్ అర్బనైజేషన్-హౌసింగ్, అత్యుత్తమ మౌలిక వసతులు ఈ ఏడు గ్రోత్ డ్రైవర్లు. ఈ జిల్లాలో ప్రస్తుతం ఆరు పోర్టులు ఉంటాయి. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ డీప్ వాటర్, కాకినాడ యాంకరేజ్ పోర్టు ప్రస్తుతం ఆపరేషన్ లో ఉన్నాయి. కాకినాడ గేట్ వే, మూలపేట పోర్టులు త్వరలో అందుబాటులోకి వస్తాయి. కొత్తగా 7 రైల్వే ప్రాజెక్టులు, 9 రహదారుల ప్రాజెక్టులు, 77 కి.మీ. మేర వైజాగ్ మెట్రో రైల్ ప్లాన్ చేస్తున్నారు.
ఆర్థికంగా బలంగా ఉండేలా పెట్టుబడుల ఆకర్షణ
ఈ జిల్లాల్లో 12 తయారీ కేంద్రాలు, 18 వ్యవసాయ ప్రాంతాలు, వరల్డ్ క్లాస్ నర్సరీ, ఫుడ్ పార్క్స్, ఆక్వాపార్క్, 5 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. వీఈఆర్ అభివృద్ధికి అదనంగా 7.5 లక్షల ఇళ్లు, 10 వేల హోటల్ రూములు, 20 వరకు మెడికల్, ఐటీ, స్కిల్లింగ్ కాలేజీలు, 5,000 హాస్పటల్ బెడ్స్, పరిశ్రమలకు 50 వేల ఎకరాలు, 50 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ సముదాయం, 60 మిలియన్ చదరపు అడుగుల గిడ్డంగులు అవసరం. వీటిని క్రమంగా సమకూర్చేలా.. పకడ్బందీగా ప్రణాళికలు అమలు చేస్తారు. పెట్టుబడుల పరంగా ఎక్కువగా ఆకర్షణీయంగా ఈ ప్రాంతం ఉంటుంది కాబట్టి .. చంద్రబాబు ఈ రీజియన్ అభివృద్ధికి ఓ పక్కా ప్రణాళిక సిద్ధం చేసి..సమర్థులైన వారికి బాధ్యతుల అప్పగిస్తే సులువుగా ట్రాక్ లోకి వస్తుందని నమ్ముతున్నారు.
