తలాతోకాలేని లేని మావిగన్ ఆలోచనకు చంద్రబాబు అభివృద్ధితోనే సమాథానమిస్తామని స్పష్టం చేశారు. అమరావతి రాజధానిపై ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొట్టిపారేశారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ వంటి అసంబద్ధ వ్యాఖ్యలకు అమరావతి నిర్మాణమే సరైన సమాధానం చెబుతుందని ఆయన స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధిని చూసి జగన్ బ్యాచ్ నోళ్లు మూతపడతాయని, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధి అనేది ఎప్పటికీ ఆగని నిరంతర ప్రక్రియ అని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలు నేటికీ ఏ విధంగా విస్తరిస్తున్నాయో, అమరావతి కూడా అదే రీతిలో అంతర్జాతీయ స్థాయిలో నిరంతరం వృద్ధి చెందుతుందని వివరించారు. అభివృద్ధికి ముగింపు ఉండదని, విజన్ ఉన్న నాయకులు మాత్రమే భవిష్యత్తును ఊహించగలరని చంద్రబాబు అభిప్రాయం.
రాజధానిపై కనీస అవగాహన లేని వారు చేసే విమర్శలను తాను పట్టించుకోనని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని, అది ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నమని ఆయన గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, చట్టబద్ధమైన రాజధానిగా అమరావతి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని, త్వరలోనే దేశంలోని అత్యుత్తమ నగరాల సరసన నిలుస్తుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
