తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో ఇమేజ్‌ని మార్చడం, అప్పటి వరకూ చేస్తూ వచ్చిన రెగ్యులర్ యాక్టింగ్, రెగ్యులర్ లుక్ నుంచి కంప్లీట్ ఛేంజ్ ఓవర్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. ఆ రేంజ్లో మార్పు అంటే మన హీరోలు కూడా సిద్ధంగా ఉండరు. అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న భయాలు వాళ్ళకు చాలానే ఉంటాయి. ఆ భయంతోనే ‘గజిని’ సినిమా రీమేక్‌లో యాక్ట్ చేసే ధైర్యం చేయలేకపోయానని పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఒప్పుకున్నాడు కూడా. అయితే నాన్నకు ప్రేమతో సినిమాతో అలాంటి రేర్ ఫీట్ సాధించాడు ఎన్టీఆర్. ఈ విషయంలో ఎన్టీఆర్ కంటే కూడా సుకుమార్‌కి ఎక్కువ మార్కులు వెయ్యాలి. ఎప్పటినుంచో క్లాస్ అండ్ ఓవర్సీస్ ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలనుకుంటున్న ఎన్టీఆర్ కలను అలా నిజం చేశాడు సుకుమార్.
నాన్నకు ప్రేమతో సినిమాకు ముందు ఎన్టీఆర్ ఉన్న సిచ్యుయేషన్‌లోనే ఇప్పుడు చరణ్ కూడా ఉన్నాడు. చిరుత సినిమాతో ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని కూడా బాగానే సంపాదించుకున్న చరణ్ ‘రచ్చ’ సినిమా నుంచీ ఒకే రకం రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేసి క్లాస్, ఓవర్సీస్ ఆడియన్స్‌కి దూరమయ్యాడు. బ్రూస్ లీ సినిమా దెబ్బకు ఆ విషయాన్ని చరణ్ కూడా బాగానే రియలైజ్ అయ్యాడు. అందుకే ధృవ సినిమాతో డ్యామేజ్ కంట్రోల్‌కి ట్రై చేశాడు. ఇక ధృవ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో కంప్లీట్ మేకోవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చరణ్. సుకుమార్ కూడా సరికొత్త రామ్ చరణ్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నాల్లోనే ఉన్నాడట. నాన్నకు ప్రేమతో సినిమాలో అల్ర్ట్రా మోడర్న్ స్టైలిష్ గయ్ అభిరామ్‌గా ఎన్టీఆర్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేసిన సుకుమార్ ఇప్పుడిక రామ్ చరణ్‌ని ఏ రేంజ్లో చూపిస్తాడో చూడాలి మరి.