చెన్నైలో భీకర పరిస్థితి: జనానికి నరకం చూపిస్తున్న వర్షం

హైదరాబాద్: సోమవారం సాయంత్రంనుంచి నిరాటంకంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెన్నై ప్రజలు ప్రత్యక్షనరకాన్ని చవిచూస్తున్నారు. నగరంలోని ఎన్నోకాలనీలు నీట మునిగిపోయి కాలవలను తలపిస్తున్నాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన కొన్ని కాలనీల వాసులు సహాయంకోసం హాహాకారాలు చేస్తున్నారు. బైక్స్, స్యూటర్స్ వంటి టూవీలర్స్, కార్లు రోడ్లపై తిరిగే పరిస్థితిలేదు. వర్షపు నీరు వెళ్ళటానికి వీలులేకపోవటంతో నీరు నిలిచిపోతోంది. ఎగ్మూర్‌లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. వీటిన్నింటికీ తోడుగా రాత్రి పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక ఆసుపత్రులలో రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. మీనంబాకంలోని విమానాశ్రయంలోకి వర్షం నీరు ప్రవేశించటంతో రేపు ఉదయం వరకు మూసేశారు. ఫ్లైట్‌లన్నీ రద్దు చేశారు. అటు రైల్వే స్టేషన్‌లో కూడా అదే పరిస్థితి. స్టేషన్‌లో వందలమంది ప్రయాణీకులు చిక్కుకుపోయారు. నిన్న ఉదయం ఆఫీసులకు వెళ్ళినవారు లోకల్ రైల్వై స్టేషన్‌లలో ఇరుక్కు పోయి ఇళ్ళకు చేరలేకపోయారు. బస్ సర్వీసుల సంగతి సరే సరి. గత 24 గంటల వ్యవధిలో 34.7 సెంటీ మీటర్ల వర్షం కురవగా, మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లుగా ఈ వర్షాలు మరో నాలుగు రోజులు కొనసాగుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
chennairains (3)

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్(ఎన్‌డీఆర్ఎఫ్) దళాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. నీటమునిగిన కాలనీలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఐదు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు చెన్నైలో విధులు నిర్వర్తిస్తుండగా, బెంగళూరు, గుంటూరు నుంచి మరో రెండు బృందాలను పంపుతున్నారు. నేవీ దళాలు పడవలతో సహా 20మంది నావికులను, ఎన్‌డీఆర్ఎఫ్ 96 పడవలతో విధులు నిర్వర్తిస్తున్నాయి. ఎయిర్ ఫోర్స్ అధికారులు తమ హెలికాప్టర్లను, మిగ్ విమానాలను సహాయక చర్యలకోసం పంపించారు. మునిగిపోయిన కాలనీల ప్రజలు, రైల్వే స్టేషన్‌లలో చిక్కుకున్న ప్రయాణీకులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సురక్షిత ప్రాంతాలలో ఉన్నవారు – బాధితులకు ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటున్నారు. అడయార్ ప్రాంతంలో ప్రవహించే అడయార్ వాగులో నీటిమట్టం పెరిగిపోతుండటంతో ఆ వాగుపైనున్న వంతెనను ముందు జాగ్రత్తగా మూసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల కారణంగా చనిపోయినవారి సంఖ్య 188కు చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫోన్ చేసి సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం పూర్తిగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

chennairains (1)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com