చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ మాత్రం తగ్గడం లేదు. ఖాళీగా జైలులో ఉంటూ.. బయటకు వస్తే ఎలాంటి డ్రామాలు వేయాలో మందుగానే ప్రాక్టీస్ చేస్తున్నారేమో కానీ. బయటకు వచ్చినప్పుడల్లా అరుపులు, కేకలతో దడదడలాడిస్తున్నారు. మంగళవారం కోర్టులో హాజరు పరిస్తే న్యాయమూర్తి ముందు తానే వాదనలు వినిపించుకున్నారు. ఆ వాదనలు ఏమిటంటే.. తన తండ్రి, సోదరుడు మద్యం కారణంగానే చనిపోయారని.. అందుకే తాను మద్యం జోలికి వెళ్లకూడదని అనుకున్నానని కానీ తనను మద్యం కేసులోనే అరెస్టు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అది కూడా ఆయన ఏడుపు ముఖంతో దీనంగా చెప్పుకోవడం మరింత హైలెట్ గా నిలిచింది.
న్యాయమూర్తి ముందు ఇలాంటి వేషాలు వేసిన చెవిరెడ్డి బయట మాత్రం అంతు చూస్తానని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసుల్ని బెదిరిస్తున్నారు. తాను బయటకు వచ్చాక సిట్ కార్యాలయం ముందే ఇల్లు తీసుకుని ఒక్కొక్కరి సంగతి తేలుస్తానని హెచ్చరిస్తున్నారు. తనను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన వారిపైనా రుబాబు చేశారు. అవన్నీ వీడియోల రూపంలో దర్యాప్తు అధికారులు కోర్టుకు సమర్పించారు.
మద్యం ఆయన తాగారని సిట్ కేసులు పెట్టలేదు. మద్యం కేసులో డబ్బులను తరలించడంలో, డెన్లను నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించారని.. కేసులు పెట్టారు. అంతా తెలిసి కూడా మద్యం కేసులో తనను ఇరికించారని ఆయన అంటున్నారు. ఆయన పీఏలు ఇద్దర్ని అరెస్టు చేశారు. ఎన్నికల సమయంలో దొరికిన ఎనిమిదిన్నర కోట్లను సీజ్ చేశారు. అయినా ఇంకా ఇంకా బుకాయిస్తూనే ఉన్నారు.