ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాంలో నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు భిన్నమైన తీర్పులు ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్ రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపి వారికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డితో పాటు ముప్పిడి అవినాష్ రెడ్డిల బెయిల్ పిటిషన్లను మాత్రం హైకోర్టు కొట్టివేసింది.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అనుచరుడు వెంకటేష్ నాయుడుతో కలిసి బెంగళూరు ఎయిర్ పోర్టు నుండి శ్రీలంక పారిపోతూండగా బెంగళూరు ఎయిర్ పోర్టులో గత ఏడాది జూన్ లో అరెస్టు చేశారు. అప్పటి నుండి ఆయన జైల్లో ఉన్నారు. కింది కోర్టులో బెయిల్ సాధించేందుకు అనేక పిటిషన్లు వేశారు. కానీ హైకోర్టును ఆశ్రయించలేదు. గతంలో బెయిల్ వచ్చేస్తుందని ఆస్పత్రిలో చేరి నాటకాలాడారు. ఇప్పుడు కూడా ఆయన తనకు వెరికోస్ వెయిన్స్ అనే వ్యాధి ఉందని చెప్పి మంతెన ఆశ్రమంలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు బెయిల్ లభించింది.
గత వైసీపీ ప్రభుత్వంలో అధికారికంగా ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డి లిక్కర్ స్కాంను ఒంటిచేత్తో నడిపారని విజయసాయిరెడ్డి ప్రకటించారు. గత ఏడాది ఏప్రిల్ 21, 2025న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. సిట్ అధికారులు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరుకాకుండా పరారీ కావడంతో రాజేష్ రెడ్డి అనే నకిలీ పేరుతో విమాన టికెట్ బుక్ చేసుకుని హైదరాబాద్ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన తండ్రి ఫోన్ మెసేజ్ల ఆధారంగా లొకేషన్ గుర్తించిన సిట్ బృందం, శంషాబాద్ ఎయిర్పోర్టులో మాటు వేసి పట్టుకుంది. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు.
