వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయం ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది. జగన్ ని గుప్పిట్లో పెట్టుకుని పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు గట్టి పోటీ ఎదురవుతోంది. జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడేపల్లిలోనే మకాం వేసి, జగన్‌కు అత్యంత సన్నిహితంగా పనులు చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు సీనియర్ నేతల మధ్య వ్యూహాల పరంగా భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అరెస్టులతో సెంటిమెంట్ – చెవిరెడ్డి సర్వే నివేదికలు!
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జగన్ దగ్గర ఒక సరికొత్త సర్వే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం తమ పార్టీ నేతలను అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సింపతీ పెరుగుతోందని, జగన్ ఇమేజ్ గ్రాఫ్ పైకి వెళ్తోందని ఆయన నివేదికలు ఇస్తున్నారట. మరిన్ని అరెస్టులు జరిగేలా ప్లాన్ చేస్తేనే కేడర్ లో కసి పెరుగుతుంది.. పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది” అని ఆయన జగన్‌కు నూరిపోస్తున్నట్లు తాడేపల్లి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్‌ను ఖుషీ చేసే ఈ సెంటిమెంట్ రాజకీయాలకు చెవిరెడ్డి కొత్త వ్యూహకర్తగా మారుతున్నారు.
చెవిరెడ్డి వ్యూహాలకు సజ్జల వ్యతిరేకం
అయితే ఏదైనా తన మాటే నెగ్గాలనుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం చెవిరెడ్డి వ్యూహాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ అనేక ఒడిదుడుకుల్లో ఉందని, మరిన్ని అరెస్టులు జరిగితే ద్వితీయ శ్రేణి నాయకత్వం పూర్తిగా దెబ్బతింటుందని ఆయన హెచ్చరిస్తున్నారట. అరెస్టుల వల్ల ఇమేజ్ రావడం పక్కన పెడితే.. పార్టీ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది అనేది సజ్జల వాదన. అయితే జగన్ మాత్రం సజ్జల కంటే చెవిరెడ్డి రిపోర్టులకే ఎక్కువ విలువ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు తాడేపల్లిలో సజ్జల మాటే వేదంగా ఉండేది. కానీ ఇప్పుడు చెవిరెడ్డి రాకతో సీన్ మారింది. ఆధిపత్యం విషయంలో ఈ ఇద్దరి మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ బయటకు వచ్చే ముందు ఇచ్చే నివేదికలు, సోషల్ మీడియా నెరేటివ్ల విషయంలో చెవిరెడ్డి పెత్తనం పెరిగిందని, దీంతో సజ్జల కొంత అసహనంగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
జగన్ నిర్ణయమే కీలకం
తాడేపల్లిలో సాగుతున్న ఈ చెవిరెడ్డి వర్సెస్ సజ్జల పోరాటం పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. సజ్జల అనుభవం గొప్పదా లేక చెవిరెడ్డి తెస్తున్న అరెస్టుల సెంటిమెంట్ వ్యూహం గొప్పదా అనేది జగన్ నిర్ణయిస్తారు. ఈ ఇద్దరు నేతల మధ్య వైరం ఇలాగే కొనసాగితే, అది వైసీపీ కేడర్‌ను మరింత అయోమయంలోకి నెట్టే ప్రమాదం ఉంది. కానీ జగన్ సజ్జల విషయంలో నమ్మకం కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టే చెవిరెడ్డికి ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. అదే నిజమైతే.. వచ్చే ఆరు నెలల్లో సజ్జల ప్లేస్ లోకి చెవిరెడ్డి వచ్చినా ఆశ్చర్యం ఉండదని చెప్పుకుంటున్నారు.
