“ఎవడ్రా నన్ను బావిలోకి తోసింది… “ బావి నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరో అడుగుతాడు. అప్పటిదాకా అందరూ అతను హీరోలాగా లోపలికి దూకాడని అనుకుంటూ ఉంటారు. కానీ అసలు విషయం మాత్రం దూకాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో వెనుక నుంచి ఎవరో తోసేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అలాగే ఉంది. భారత్ ఉగ్రవాదంపై యుద్ధం కనిపించడం ఖాయం కావడంతో… ఎలా వ్యవహరించాలో ఆ దేశానికి అర్థం కావడం లేదు. ఉగ్రవాదులకు మద్దతిస్తున్నట్లుగా దొరికిపోకూడదు.. అలాగని వాళ్లను వదిలేయలేరు. ఈ ఊగిసలాటలో పాకిస్తాన్ కు చైనా, బంగ్లా.. ముందుకు తోస్తున్నాయి.
పాకిస్తాన్ కు అప్పలిచ్చి కబ్జా చేయాలనుకుంటున్నా చైనా
మేమున్నాం కదా.. ఉగ్రవాదులకు అండగా ఇండియాపై పోరాడు అని ముందుకు తోస్తున్నాయి. ఉగ్రవాదులపై దాడి చేస్తే .. పాక్ కోసం తాము అండగా ఉంటామని చైనా చెబుతోంది. చైనా సాయం పాకిస్తాన్ కు అప్పు ఇవ్వడం వరకే ఉంటుంది. అది కూడా బాంబులు, మందుగుండు సామాగ్రి ఇస్తుంది. వాటిని దీపావళి టపాసులు కాల్చుకున్నట్లుగా కాల్చుకుని పాక్ సైనికులు చేతులు కాల్చుకోవడం తప్ప.. ఏమీ చేయలేరు. కానీ చైనా రుణం మాత్రం నెత్తి మీద ఉంటుంది. శ్రీలంక సహా అనేక దేశాల్ని చైనా ఎలా అప్పులు ఇచ్చి గుప్పిట్లో పెట్టుకుందో పాకిస్తాన్ నూ అలాగే కబ్జా చేసేస్తుంది. యుద్ధం అంటూ జరిగితే ముందుగా పాకిస్తాన్ ను గెలిచేది చైనానే . అందుకే ముందుకు తోస్తోంది.
బంగ్లాలో నియంత పాలన చేయాలనుకుంటున్నా యూనస్
ఇక పాకిస్తాన్ ను ముందుకు తోసే పనిలో బంగ్లాదేశ్ ఉంది. ఆ దేశంలో నియంత పాలన తీసుకు వచ్చిన శాంతి బహుమతి విజేత యూనస్..కూర్చుంటే లేవలేని స్థితిలో తానే సుప్రీంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎన్నికల ఆలోచన చేయడం లేదు. హసీనాకు మళ్లీ ప్రజాదరణ పెరుగుతూండటంతో ఎక్కడ తిరుగుబాటు జరుగుతుందో అని వణికిపోతున్నారు. ఇండియాలో హసీనా ఉండటంతో ఆయన కంగారు పడిపోతున్నారు. అందుకే భారత్ పై కుట్రలు చేయాలంటే.. పాకిస్తాన్ కు సపోర్టు చేస్తే చాలనుకుంటున్నారు. తాము ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తామని అంటున్నారు.
చైనా, బంగ్లాలా కోసం పాకిస్తాన్ బావిలోకి దూకుతుందా?
ఈ రెండు దేశాల తీరుతో పాకిస్తాన్ కు ధైర్యం వస్తుందో.. లేకపోతే ఆ దేశాలు తమ స్వార్థం కోసం తనను బలి చేయాలనుకుంటున్నాయని గుర్తించిందో స్పష్టత లేదు. కానీ పాకిస్తాన్ కు మాత్రం యుద్ధం అంటే భయం వేస్తోంది. చివరికి ఉగ్రవాదుల ఏరివేతకు సహకరిస్తే బతికిపోతావని.. అంతర్జాతీయంగా వస్తున్న సలహాలను వింటోంది. మంచి నిర్ణయం తీసుకుంటే సరి.. లేకపోతే.. యుద్ధం అనే బావిలోకి చైనా , బంగ్లా తోసేయడం ఖాయం.