శంషాబాద్ ప్రాంతం ఒకప్పుడు కేవలం విమానాశ్రయానికి పరిమితమైన శివారు ప్రాంతంగా ఉండేది. కానీ, ఇప్పుడు అది అంతర్జాతీయ స్థాయి ఏరోట్రోపోలిస్ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ పరిణామం చుట్టుపక్కల 20 కిలోమీటర్ల పరిధిలోని రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరి పోసింది.
శంషాబాద్‌ను కేవలం విమానాశ్రయంగానే కాకుండా, చుట్టూ వాణిజ్య, పారిశ్రామిక, మరియు వినోద కేంద్రాలు కలిగిన ఒక పూర్తిస్థాయి ఏరోట్రోపోలిస్ నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై వంటి నగరాలను కలిపే హైస్పీడ్ రైల్వే కారిడార్ టెర్మినల్ ఇక్కడ ఏర్పాటు కానుంది. దీనికి తోడు మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో రానుండటం, శంషాబాద్‌ను నగరంలోని ప్రధాన ఐటీ హబ్‌లతో అనుసంధానించడం ఈ ప్రాంతంపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని రెట్టింపు చేసింది.
ఏరోట్రోపోలిస్ ప్రణాళికల వల్ల శంషాబాద్ చుట్టుపక్కల 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న తుక్కుగూడ, మహేశ్వరం, మమిడిపల్లి, బాచుపల్లి వంటి గ్రామాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో కేవలం వ్యవసాయ భూములుగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు విలాసవంతమైన విల్లాలు, భారీ గేటెడ్ కమ్యూనిటీలు ,ఓపెన్ ప్లాట్ల వెంచర్లు వెలుస్తున్నాయి. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో ప్రాపర్టీ ధరలు 100% పైగా పెరిగాయని మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కారిడార్‌లో ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఇన్వెస్టర్లు ఇప్పుడు భారీ లాభాలను ఆర్జిస్తున్నారు.
రాబోయే ఐదు నుంచి పదేళ్లలో శంషాబాద్ ప్రాంతం మరొక రోకాపేట స్థాయికి ఎదుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ స్థాయి ఐటీ పార్కులు, లాజిస్టిక్ హబ్‌లు, ఫైవ్ స్టార్ హోటళ్లు ఇక్కడ కొలువుదీరనుండటంతో, ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి పెట్టడం సురక్షితమని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి.
