అనిల్ రావిపూడి ఒక విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు. తనని ‘క్రింజ్ ఫిల్మ్ మేకర్’గా ట్రోల్ చేసినా, ఏ మాత్రం ఒరిజినల్ వాయిస్ లేని డైరెక్టర్ అని విమర్శించినా, ఆ విమర్శల్నీ ట్రోలింగ్నీ బాక్సాఫీస్ హిట్లతోనే తిప్పికొడుతున్నాడు. ఆడియన్స్ మూడ్‌ను బట్టి కథ రాయడం, థియేటర్స్ పేలే కంటెంట్ రెడీ చేసుకునే టెక్నిక్‌ని భలే పట్టేశాడు.
సంక్రాంతి వస్తున్నాం అంత పెద్ద విజయం కావడానికి కారణం – సీజన్‌కి తగ్గ సరుకు సప్లై చేయడమే. వెంకటేష్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, హిట్టు పాటలు, పిల్లల్ని ఆకర్షించే బుల్లిరాజు, నవ్వించే కామెడీ గ్యాంగ్, ఆడియన్స్‌ని థియేటర్స్‌కి తీసుకొచ్చే ప్రమోషన్స్ – ఇంతకంటే సంక్రాంతి బొమ్మకి ఏం కావాలి?
ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నాడు అనిల్. ఈ సినిమా టార్గెట్ కూడా సంక్రాంతే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. తాజాగా ముస్సోరీలో సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టారు. ఓ స్కూల్ గ్రౌండ్లో, టేబుల్ మీద కూర్చున్న చిరంజీవి, గుంపులుగా వస్తున్న పిల్లలు – ఇలాంటి వీడియో ఒకటి వదిలారు. ఈ వీడియోలో బోలెడు పండగ వైబ్ కనిపించింది.
సంక్రాంతికి ఫ్యామిలీ అంతా సినిమాకి రావాలంటే పిల్లలు చాలా ముఖ్యం. వాళ్లని ఎట్రాక్ట్ చేసే కంటెంట్ వుంటే, పిల్లల ట్రాక్స్ వుంటే – అంతకంటే మాస్ ఎలిమెంట్ మరొకటి వుండదు. తాజాగా వచ్చిన వీడియో ప్రకారం అనిల్ చిరంజీవి కోసం మంచి ఫ్యామిలీ కథ రాసేశాడని అనుకోవాలి.
పైగా చిరంజీవికి పిల్లలతో చాలా మంచి ట్రాక్ రికార్డ్ వుంది. ఆయన కెరీర్ బ్లాక్‌బస్టర్ జగదేక వీరుడు అంత పెద్ద హిట్ కావడానికి కారణాల్లో ఒకటి..ఆ సినిమా పిల్లలకి తెగ నచ్చింది. అందులో వుండే పిల్లల పాత్రలన్నీ మెమరబుల్. పసివాడి ప్రాణం, డాడీ, చూడాలని వుంది… ఇలా చాలా సినిమాల్లో పిల్లలది ప్రధాన భూమిక. అలాంటి చైల్డ్ ఎపిసోడ్స్ అనిల్ మార్క్ హ్యూమర్‌తో పడితే సంక్రాంతికి చిరు–అనిల్ సినిమా మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడం ఖాయం.