విజయ్ దేవరకొండ టాప్ స్టార్: చిరంజీవి

‘గీత గోవిందం’ సక్సెస్ సెలబ్రేషన్స్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ గురించి తెగ చెప్పారు. ఓ రకంగా చెప్పాలంటే… అతణ్ణి ఆకాశానికి ఎత్తేశారు. మన ఇండస్ట్రీకి దొరికిన అరుదైన వెర్సటైల్ స్టార్ అన్నారు. ‘గీత గోవిందం’తో టాప్ స్టార్ హీరోల్లో అతనూ ఒకడు అయ్యాడని చెప్పారు. ‘విజేత’తో తనకు ఎటువంటి ఫ్యామిలీ ఇమేజ్ వచ్చిందో… ఈ ‘గీత గోవిందం’తో విజయ్ దేవరకొండకి అటువంటి ఇమేజ్ వచ్చిందని చెప్పారు. చిరంజీవి స్పీచ్ ఆద్యంతం విజయ్ దేవరకొండకు సంతోషం కలిగించేలా సాగిందంటే అతిశయోక్తి కాదు.

‘గీత గోవిందం’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో చిరంజీవి మాట్లాడుతూ “ఇక్కడున్న వైబ్రేషన్స్‌ చూస్తుంటే ఇది మాదా? విజయ్‌ దేవరకొండదా? అనేది అర్థం కావట్లేదు. అతను చెప్పినట్టు.. శనివారం రాత్రి రెండుగంటల వరకూ ‘సైరా’ షూటింగ్‌ చేశాం. ఆదివారం రాత్రి కూడా వందలమందితో షూటింగ్‌ ప్లాన్‌ చేశాం. అయితే… ‘ఒక్క రోజు షూటింగ్‌ ఆగినంత మాత్రాన్న ఏం జరగదు’ అని అనుకున్నా. కొన్నిసార్లు వర్షం పడితే ఆపేస్తుంటాం. ఇలాంటి వేడుకల్లో పాలు పంచుకోవడం నా బాధ్యత. నాకు ఎంతో సంతృప్తిగా, సంతోషంగా ఉంటుంది. ప్రేక్షకులు, అభిమానుల ఆశీసులు, ఆదరణ వల్లే మాకింత ఆనందం దక్కుతోంది. సినిమా బావుంటే ప్రేక్షకులు బడ్జెట్‌ గురించి ఆలోచించరు. వాళ్లకు ప్రతిదీ పెద్ద సినిమాయే. రెండేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతోషం తోటి, ఉత్సాహం తోటి, ప్రోత్సాహం తోటి ముందుకెళ్తోంది. సినిమాల్లో చిన్న, పెద్ద తేడా లేదు. ఎంత బడ్జెట్‌లో తీసిన సినిమాలైనా విజయం సాధిస్తున్నాయి.

నేను 1978 నుంచి 30 సినిమాలు చేసినా… ‘ఖైదీ’ నాకు స్టార్‌ స్టేటస్‌ ఇచ్చింది. ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండకి స్టార్‌ స్టేటస్‌ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న టాప్‌ స్టార్స్‌లో తనూ ఒకడు. అతణ్ణి స్వాగతిస్తున్నా. ప్రేక్షకుల కేరింతల్ని తలలో కాకుండా గుండెల్లో పెట్టుకుంటే… వాళ్లూ గుండెల్లో పెట్టుకుంటారు. మన ఇండస్ట్రీకి దక్కినటువంటి మరో అరుదైన వర్సటైల్‌ స్టార్‌ అతను. గీతా ఆర్ట్స్‌ సంస్థలో నటించిన ‘విజేత’ గుర్తొచ్చింది. అప్పుడు వరుసగా ‘ఖైౖదీ’ వంటి మాస్‌ సినిమాలు చేస్తూ, యాక్షన్‌ హీరోగా పేరు తెచుకున్న నాకు… ‘విజత’ కుటుంబ ప్రేక్షకుల్ని దగ్గర చేసింది. ఆల్‌క్లాస్‌ హీరో అనిపించుకోవడానికి దోహదపడింది. ఇప్పుడు ‘గీత గోవిందం’ విజయ్‌ దేవరకొండకి అదే విధంగా దోహదపడింది. అతనికి ఇది ల్యాండ్‌ మార్క్‌ ఫిల్మ్‌. ‘అర్జున్‌రెడ్డి’లో పాత్రకి, ‘గీత గోవిందం’లో పాత్రకి చాలా వ్యత్యాసం చూపించాడు” అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com