టాలీవుడ్ లో సమ్మె సెగ రోజు రోజుకీ పెరుగుతోంది. అటు నిర్మాతలు.. ఇటు కార్మికులు ఏ ఒక్కరూ తగ్గడం లేదు. ఇరు వర్గాలూ ఇండస్ట్రీ పెద్దల్ని కలుస్తున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని కలుసుకొన్న సంగతి తెలిసిందే. ఈరోజు కార్మిక సంఘాల నాయకులు కూడా చిరంజీవిని కలిశారని, ఈ మేరకు వేతనాల పెంపుపై చిరు తమకు భరోసా ఇచ్చారని, కనీసం తన సినిమా కోసం పని చేస్తున్న కార్మికులకు 30 శాతం మేరకు వేతనాలు పెంచేలా తాను చూసుకొంటానని చిరు స్వయంగా చెప్పారని కొంతమంది వ్యక్తులు మీడియా ముందు లీకులు అందిస్తున్నారు. ఇవన్నీ చిరంజీవి దృష్టికి వెళ్లాయి. దాంతో ఆయన స్పందించారు.
తాను ఈ రోజు ఏ కార్మిక సంఘాల నాయకుల్ని కలవలేదని, తన నుంచి ఎటువంటి హామీ ఇవ్వలేదని, వ్యక్తిగతంగా ఏ ఒక్కరూ ఈ సమస్యకు పరిష్కారం చూపించలేరని, ఇండస్ట్రీలో ఛాంబర్ నిర్ణయాలే కీలకమని, అక్కడ ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకం ఉందంటూ చిరు ఓ ట్వీట్ చేశారు.
”నా దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే — ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్లి, నేను వారిని కలసి, 30% వేతన పెంపు వంటి వారి డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ సందర్భంలో నిజం ఏంటో స్పష్టంగా చెప్పదలచుకున్నాను. నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు. ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం. ఏ వ్యక్తిగతంగా అయినా, నేను సహా, ఏకపక్షంగా ఇలాంటి సమస్యలకు హామీ ఇవ్వడం లేదా పరిష్కారం చూపడం సాధ్యం కాదు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్‌నే అగ్ర సంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయసమ్మతమైన పరిష్కారానికి రావడం ఫిల్మ్ ఛాంబర్ సమిష్టి బాధ్యత. అంతవరకు, అన్ని పక్షాల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశ్యంతో చేసిన ఇలాంటి నిరాధారమైన మరియు ప్రేరేపిత ప్రకటనలను నేను ఖండిస్తున్నాను. దయచేసి గమనించండి” అంటూ సోషల్ మీడియా ద్వారా చిరు ఓ వివరణ ఇచ్చారు. దాంతో తనపై జరుగుతున్న ప్రచారాన్ని చిరు తిప్పికొట్టినట్టైంది.