యాటిట్యూడ్ స్టార్ గా… తొలి సినిమాతోనే ఓ ట్యాగ్ లైన్ తెచ్చుకొన్నాడు చంద్రహాస్. ‘ఈటీవీ’ ప్రభాకర్ తనయుడీయన. తొలి సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినా సరే.. మొండి ధైర్యంతో మరో సినిమా చేశాడు. అదే `బరాబర్ ప్రేమిస్తా`. ఈవారమే విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ వదిలారు.
పల్లెటూరి ప్రేమ కథ ఇది. చందూ అనే కుర్రాడికీ, బుజ్జమ్మ అనే అమ్మాయికీ మధ్య పరిచయం, వాళ్ల స్నేహం, ప్రేమ.. మధ్యలో వచ్చే ఆటంకాల సమ్మేళనం ఈ కథ. చంద్రహాస్ చాలా ఈజ్ తో నటించేశాడు. ప్రెస్ మీట్లలో, ఇంటర్వ్యూలలో తన యాటిట్యూడ్ పక్కన పెడితే, స్క్రీన్ మీద మాత్రం ఈతరం కుర్రాళ్లకు నచ్చేలా కనిపిస్తున్నాడు. డైలాగులు, బాడీ లాంగ్వేజ్ అంతా మాసీ.. మాసీగా కనిపిస్తున్నాయి. ‘రెడ్డి మామ’ పాటలో స్టెప్పుల కోసం కష్టపడినట్టు కనిపిస్తోంది. చిన్న సినిమాలు ఈమధ్య ఊహించని రేంజ్ లో విజయం సాధిస్తున్నాయి. మంచి టాక్ వచ్చి, కాస్త పబ్లిసిటీ చేసుకొంటే చాలు. ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ ‘బరాబర్ ప్రేమికుడు’ కోసం చంద్రహాస్ నెగిటీవ్ పబ్లిసిటీని ఎంచుకొన్నాడనిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన పాడిన ఓ పాట ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది. సోషల్ మీడియాలో చంద్రహాస్ ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్లకు చంద్రహాస్ కౌంటర్ కూడా ఇస్తున్నాడు. పబ్లిసిటీ స్టంట్ ఎలా ఉన్నా.. కంటెంట్ బాగుంటే జనం ఆదరిస్తారు. ఈ సినిమాలో కంటెంట్ బాగుండి, చంద్రహాస్ పై పడిన నెగిటివిటీ అంతా పోవాలని టీమ్ మొత్తం కోరుకొంటోంది.
