హైదరాబాద్: తమ్ముడు పవన్ కళ్యాణ్, కొడుకు రాంచరణ్ తనకు రెండు కళ్ళలాంటివాళ్ళని చిరంజీవి చెప్పారు. రాంచరణ్ ఎంతో పవన్ కళ్యాణ్ అంతేనని చిరు అన్నారు. తాము కలవకపోయే సమస్యే లేదని, ఆదివారాలు, పండగలు, పెళ్ళిళ్ళలో కలుస్తూనే ఉంటామని చెప్పారు. పవన్‌కు, తనకు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, రాజకీయంగా కలిసి అడుగులేసే అవకాశం కష్టమేనని అన్నారు. అయితే అన్నదమ్ములుగామాత్రం ఎప్పటికీ కలిసే ఉంటామని చెప్పారు. 22న పుట్టినరోజు సందర్భంగా అన్ని మీడియా సంస్థలకూ వరసగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పోతున్న చిరు వివిధ విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. 150వ సినిమాకు ఇంకా కథ కుదరలేదని, దానిలో నటిస్తామని కుటుంబంలోని తొమ్మిదిమంది నటులూ ఉవ్విళ్ళూరుతున్నారని చెప్పారు. ‘మనం’లాంటి కాంబినేషన్ అన్నిసార్లూ కుదరదని అన్నారు. కథనుబట్టే దర్శకుడుకానీ, దర్శకుడినిబట్టి కథ కాదని అన్నారు. తనకు 60 ఏళ్ళు నిండాయన్న భావన రావటంలేదని చెప్పారు. రాజకీయాలు తనకొక ఖరీదైన అనుభవమని అన్నారు.