ఈ యేడాది రావాల్సిన పెద్ద సినిమాలన్నీ వరుసగా రిలీజ్ డేట్లు ప్రకటించుకొంటున్నాయి. చిరంజీవి సినిమా ‘విశ్వంభర’ మాత్రం డైలామాలో వుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడొస్తుందా? అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. `విశ్వంభర` చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. మహా అయితే 2 – 3 రోజుల ప్యాచ్ వర్క్ బాకీ వుంది. దాంతో పెద్దగా ఇబ్బంది లేదు. కానీ రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వాలంటే సీజీల నుంచి అవుట్ పుట్ రావాల్సివుంది.
ఈ సినిమా దాదాపు 90 శాతం ఇండోర్లోనే తీశారు. సినిమా అంతా సీజీ వర్కే. అందుకోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ స్టూడియోలు పని చేస్తున్నాయి. వాటి నుంచి అవుట్ పుట్ వచ్చాకే రిలీజ్ డేట్ ప్రకటించాలని చిరంజీవి నిర్ణయించుకొన్నార్ట. ఒకసారి సీజీ వర్క్ వచ్చి, అది నచ్చక మళ్లీ వెనక్కి పంపి, మళ్లీ రిలీజ్ డేట్ మార్చి.. ఈ గందరగోళం ఎందుకు? సినిమా మొత్తం చూసుకొన్న తరవాత అప్పుడు రిలీజ్ డేట్ ప్రకటిద్దాం అనేది చిరంజీవి మాట. యూవీ క్రియేషన్స్ కూడా దీనికే కట్టుబడి వుంది. జులై, ఆగస్టు ఈ రెండు నెలలూ ‘విశ్వంభర’కు ఛాన్స్ వుంది. 2026 సంక్రాంతికి ఎలాగూ అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది. వీటి మధ్య నాలుగైదు నెలలైనా గ్యాప్ ఉంటే సరిపోతుంది. అందుకే రిలీజ్ డేట్ విషయంలో చిత్రబృందం ఏమాత్రం కంగారు పడడం లేదని తెలుస్తోంది.