2026 సంక్రాంతి సీజన్ మొన్నే గడిచింది. 2027 సంక్రాంతికి ఇంకా 10 నెలల సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే 2028 సంక్రాంతి స్కెచ్లు వేసుకోవడంలో టాలీవుడ్ బిజీ అయిపోయింది.
సంక్రాంతి సీజన్ అనేది బంగారు బాతు అనే సంగతి టాలీవుడ్ కి అర్థమైంది. రెండు మూడేళ్ల నుంచి సంక్రాంతి బాక్సాఫీస్ చాలా రష్ గా కనిపిస్తోంది. యావరేజ్ సినిమాలు సైతం సంక్రాంతి దగ్గర భారీ వసూళ్లు మూటగట్టుకొంటున్నాయి. అందుకే సంక్రాంతిని టార్గెట్ చేస్తోంది టాలీవుడ్. 2027 సంక్రాంతి బెర్తులు అప్పుడే నిండుకున్నాయి. ఏఏ సినిమాలు రాబోతున్నాయి అనే విషయంలో దాదాపు ఓ స్పష్టత వచ్చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు 2027ని టార్గెట్ చేసేశారు.
2028 సంక్రాంతికి ఎలాంటి సినిమాలు రావాలి అనే విషయంలో ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలెట్టేశారు. ఈ సంక్రాంతికి చిరు నుంచి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ వచ్చింది. 2027 సంక్రాంతికి బాబి సినిమా రిలీజ్ చేస్తారు. ఆ తరవాత.. శ్రీకాంత్ ఓదెల సినిమా మొదలవుతుంది. 2027లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆ తరవాత చిరు చేయబోయే సినిమా విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయ చిరుకి ఓ కథ చెప్పారని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. కథ చిరంజీవికి బాగా నచ్చిందని, ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ సినిమాని 2028 సంక్రాంతి బరిలో నిలపాలని భావిస్తున్నారట. ఒకవేళ శ్రీకాంత్ ఓదెల సినిమా ఆలస్యమైతే, అప్పుడు శ్రీనివాస్ సినిమా ముందుగా మొదలెడతారు. కాకపోతే శ్రీకాంత్ ఓదెల కథ ముందు ఒప్పుకొన్నారు కాబట్టి, ఆ ముందు ప్రాజెక్టే సెట్ అయ్యే ఛాన్సుంది.