చిరంజీవి అంటే… మెగా ఎంటర్‌టైనర్.
చిరు అంటే డాన్సులు, స్టెప్పులు, మాస్ డైలాగులు, కామెడీ టైమింగ్..
చిరు సినిమా అంటే ఇవన్నీ ఉండాల్సిందే. లేదంటే అభిమానులకు కిక్ రాదు. చిరుని సుప్రిం హీరోని, మెగాస్టార్‌నీ చేసిన ఎలిమెంట్స్ అవే. దశాబ్దాలుగా చిరు నెంబర్ వన్ పొజీషన్ లో ఉండగలిగాడంటే… వాటివల్లే. అయితే.. చిరు ఈ ఛట్రంలోనే ఇరుక్కుపోయాడని, వాటిని దాటి బయటకు రాలేదని, చిరులోని నటుడు పూర్తి స్థాయిలో రాలేకపోయాడని చెబుతుంటారు. కానీ అది నిజం కాదేమో అనిపిస్తుంది. చిరు తన ఇమేజ్ ని పక్కన పెట్టి సినిమాలు చేసిన రోజులున్నాయి. అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ పక్కన పెట్టి, తనలోని నటుడికి ఏం ఇవ్వాలో అవి ఇచ్చే ప్రయత్నాలు చేసిన సందర్భాలున్నాయి. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు ఆయా సినిమాల గురించి మరోసారి గుర్తు చేసుకుంటే..
ఖైదీ తరవాత చిరు ఇమేజ్ మారిపోయింది. మాస్ హీరోగా ఓ రూటు దొరికింది. తరవాతన్నీ అలాంటి పాత్రలే దొరికాయి. వాటితోనే చిరుకి పేరొచ్చింది కూడా. ఆ క్రమంగా గుండా, హీరో, దేవాంతకుడు, మహానగరంలో మాయగాడు లాంటి సినిమాలొచ్చాయి. `ఛాలెంజ్`తో ఓ కొత్త చిరంజీవిని చూసే అవకాశం వచ్చింది. అప్పటి వరకూ వచ్చిన కమర్షియల్ కథలకు పూర్తి విభిన్నమైన సినిమా `ఛాలెంజ్`. ఆ తరవాత కొన్నాళ్లకు `విజేత` లాంటి ఫ్యామిలీ డ్రామా వచ్చింది. 1986 నాటికి చిరు పూర్తిగా మాస్ హీరో అయిపోయాడు. కానీ.. `చంటబ్బాయ్` కూడా అదే యేడాది చేశాడు. ఇది పూర్తిగా జంథ్యాల మార్కు సినిమా. చిరు కామెడీ టైమింగ్ ఏ స్థాయిలో ఉంటుందో నిరూపించిన సినిమా ఇది. ఓరకంగా `చంటబ్బాయ్` చిరు చేసిన ప్రయోగమే. చిరు సినిమా అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలేం అందులో లేవు. కాబట్టి కమర్షియల్‌గా ఆ సినిమా ఆడలేదు. కానీ.. చిరు అభిమానులు ఇప్పటికీ `చంటబ్బాయ్` సినిమాని అభిమానిస్తూనే ఉంటారు.
ఇక చిరు కెరీర్‌లో ఓ ఆణిముత్యం `ఆపద్భాంధవుడు`. పసివాడి ప్రాణం లాంటి సూపర్ డూపర్ హిట్ తరవాత వచ్చిన సినిమా ఇది. నిజానికి పసివాడి ప్రాణం తరవాత.. మళ్లీ కమర్షియల్ హంగులూ, బ్రేక్ డాన్సులూ ఉన్న కథలనే ఎంచుకుంటారు. కానీ చిరంజీవి మాత్రం కె.విశ్వనాథ్ చేతిలో ఓ శిల్పంలా ఒదిగిపోయారు. ఆ సినిమాతో తొలిసారి ఉత్తమ నటుడిగా ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది.
మంచి దొంగ, జేబు దొంగ లాంటి మాస్ సినిమాల తరవాత… `రుద్రవీణ`లాంటి క్లాసికల్ కథని ఎంచుకున్నాడు చిరు. అదో సాసహమే. చిరు అభిమానులు కూడా అంత క్లాస్‌ని స్వీకరించలేకపోయారు. దాంతో ఫ్లాప్ అయ్యింది. కానీ జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కాయి.
ఘరానా మొగుడు చిరంజీవిని తిరుగులేని స్థానంలో నిలబెట్టిన సినిమా. ఆ సినిమా ఇండ్రస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ చేసింది. ఆ వెంటనే చిరు చేసిన సినిమా.. `ఆపద్భాంధువుడు.` చిరు గట్స్‌కి ఇది నిదర్శనం. ఆ సినిమా కమర్షియల్ గా ఆడలేదు. కానీ.. చిరంజీవిలోని నటుడికి గొప్ప గౌరవం దక్కింది. నంది అవార్డుతో పాటు పలు పురస్కారాలు దక్కాయి.
ఇలా.. చిరు తన ఇమేజ్ నుంచి బయట పడడానికీ, కొత్త తరహా నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి వీలైనన్ని సార్లు ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. కొన్నిసార్లు అవి ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ. ఇప్పుడు మాత్రం ఆయా సినిమాలన్నీ క్లాసిక్స్‌గా మిగిలిపోయాయి. చిరు నటించినమాస్ సినిమాలతో పాటు. వాటిని గురించి కూడా అభిమానులు ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకుంటుంటారు. ఓ నటుడిగా చిరుకి అదే గొప్ప సంతృప్తి.