చిత్తూరు డెయిరీ విషయంలో జగన్ రెడ్డి ఇచ్చిన హామీని చేస్తున్న పనుల్ని చూసి జనం అంతా చిత్ర విచిత్రంగా చెప్పుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పున్ణప్రారంభిస్తామని మాట ఇచ్చి నాలుగేళ్ల తర్వాత అమూల్‌కు 99 ఏళ్లకు లీజుకు ఇచ్చేశారు. అదీ కూడా అణాకాణీకి . అంతేనా అదే అసలు రైతులకు చేస్తున్న గొప్ప పని అన్నట్లుగా ప్రచారం చేసేసుకుంటున్నారు. జగన్ తీరు చూసి హవ్వ అని నోరు వెళ్లబెట్టేసుకోవడం తప్ప.. ఏమీ చేయలేకపోతున్నారు పాడి రైతులు. ఏమన్నా అంటే కేసులు అవుతాయి మరి!
1978లో చిత్తూరు జిల్లా కేంద్రంలోని విజయ సహకార డెయిరీ పాలవెల్లువ సృష్టించింది. దాదాపు ఆరువేల లీటర్ల పాల సామర్థ్యంతో ప్రారంభమై రెండు లక్షల లీటర్ల పాల సేకరణతో దేశంలోనే అతిపెద్ద పాల డెయిరీగా పేరు పొందింది. 2002 ఆగస్టు 31వ తేదీన హఠాత్తుగా మూతపడింది. డెయిరీ మూతపడటంతో దాదాపు 300 మందికి పైగా వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడ్డారు. సహకార రంగంలో నడుస్తున్న పాలడెయిరీలో జిల్లాలోని పాడి రైతులు భాగస్వాములుగా ఉండేవారు. 33ఏకరాల్లో ఏర్పాటు చేసిన పాలడెయిరీ ఆస్తులతో పాటు ఐదారు ప్రాంతాల్లో పాలశీతల కేంద్రాలు కూడా ఉన్నాయి.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా డెయిరీ మళ్లీ తెరిపిస్తామని ప్రకటనలు చేసేవారు. కానీ అందరూ రాజకీయాల కోసం పాడి రైతుల్ని వాడుకునేవారు. తెరిపించేవారు కాదు. కానీ ఎవరూ డెయిరీ ఆస్తుల్ని అప్పనంగా ఎవరో ఒకరికి కట్టబెట్టేసి.. అసలు డెయిరీని లేకుండా చేయాలని ఆలోచించలేదు. కానీ అందరిలా జగన్ కాదుగా.. అందుకే 99ఏళ్లకు లీజుకు ఇచ్చేశారు. అదేమంటే అది కూడా సహకార డెయిరీనే అంటున్నారు. ఈ సమాధానం విని మూర్చపోవడం తప్ప ఏమీ చేయలేరు.
సహకార విజయ డెయిరీ ఏర్పాటులో కీలపాత్ర పోషించింది పాపుదేశి వెంకట కృష్ణమనాయుడు అనే పెద్దాయన. ఆయన విగ్రహం డెయిరీ ముందు ఉంటే కూల్చి పడేశారు. అసలు ఆనవాళ్లు లేకుండా చేసేశారు. ఇదా జగన్ అంటే అని పాడి రైతులు ఆశ్చర్యపోతున్నారు.