విశాఖలో ఏసీబీ అధికారి పేరుతో బెదిరింపులకు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత విచారణ చేస్తే ఏసీబీ ఎస్పీకి పేరుతో ఓ మహిళ ఫోన్ చేసి దబాయించిందని బాధితుడు చెప్పాడు . ఆ మహిళను పట్టుకునే సరికి పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. ఆమె పేరు స్వర్ణలత. పోలీసు అధికారిణే. ఆమెతో పాటు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ స్వర్ణలత ట్రాక్ రికార్డు మామూలుగా లేదు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రోజు స్వర్ణలత అనే అధికారిణి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడిపై ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోయారు. బట్టలిప్పి కొట్టడం కూడా వచ్చని హెచ్చరించారు. ఆమెతో ఎలా ఎలా ప్రెస్మీట్ పెట్టించారో కానీ…తనకు వైసీపీ భావజాలం చాలా ఉందని తర్వాత నిరూపించుకున్నారు. వైసీపీ హయాంలోనే కొద్ది రోజులకు నోట్ల మార్పిడి పేరుతో ఓ ముఠా బెదిరింపులు, దందాలకు పాల్పడింది. ఆ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే స్వర్ణలత అనే పోలీసు అధికారి ఆ ముఠాలో భాగం. ఆమె విధుల్లో ఉండి ఆ ముఠాతో కలిసి దోపిడీకి పాల్పడ్డారు. ఆ ఘటన తర్వాత ఆమెను అరెస్టు చేశారు. బెయిల్ పై బయటకు వచ్చారు.
విశాఖ నుంచి బాపట్లకు పంపించారు. ఇప్పుడు ఆమె అక్కడ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ గా ఉన్నారు. కానీ సెలవు పెట్టారో లేకపోతే తన ఫుల్ టైమ్ జాబ్ ముఖ్యమని అనుకున్నారో కానీ విశాఖలోనే బెదిరింపులకు దిగి డబ్బులు వసూలు చేస్తున్నారు. ముఠాను తయారు చేసుకుని ఏసీబీ పేరుతో దొంగదాడులు చేసి దోచుకుంటున్నారు. ఈమెను రెండో సారి అరెస్టు చేశారు. కరుడు గట్టిన క్రిమినల్ మాదిరిగా దోపిడీలకు పాల్పడుతున్న ఈమెను ఇంకా పోలీస్ వ్యవస్థలో ఎందుకు కొనసాగిస్తున్నారో కానీ.. ఆమె మాత్రం తన బుద్ది మార్చుకోవడం లేదు. కొస మెరుపేమిటంటే.. మేడంకు కళాపోషణ కూడా ఎక్కువే. డాన్సులు కూడా చేసేసి వీడియోలు చేస్తారు. సినిమాల్లోనూ ట్రై చేశారు.