విశాఖలో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ దేశ పారిశ్రామిక రంగాన్ని ఆకర్షిస్తోంది. తొలి రోజు ట్రేడ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ, క్లైమేట్ యాక్షన్, జియో-ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్, ఇన్‌క్లూజన్ వంటి అంశాలపై 48 సెషన్లుజరిగాయి. సమ్మిట్ ను ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ దేశ గ్రోత్ ఇంజిన్‌గా మారుతోందని అవకాశాలను పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలని చంద్రబాబు కోరారు. ఈ సమ్మిట్ “టెక్నాలజీ, ట్రస్ట్ & ట్రేడ్” అనే థీమ్‌తో జరుగుతోంది.
సమ్మిట్ మొదటి రోజు రూ. 3.65 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు జరిగాయి. కొరమండల్ విశాఖలో రూ. 2,000 కోట్లతో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుంది. అదానీ పోర్ట్స్, సెజ్ ఎండీ కరణ్ అదానీ డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ ఉత్పత్తి తదితర రంగాల్లో పెట్టుబడులను ప్రకటించారు.
బజాజ్ ఫిన్ సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ యువతకు అండగా ఉండేలా రాహుల్ బజాజ్ స్కిల్లింగ్ సెంటర్లు… విజయవాడ, విశాఖ, రాజమండ్రి, శ్రీసిటీ, తిరుపతిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నౌకా నిర్మాణం, పర్యాటకం లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భారత్ ఫోర్జ్ నిర్ణయించిందని ఆ సంస్థ ఎండీ చెప్పారు. లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీరాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో లులూ గ్రూప్ అత్యాధునిక మాల్స్‌తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోందన్నారు.
రిలయెన్స్ ఇండస్ట్రీస్ AI డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటేడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 1 GW ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటుతో ప్రపంచంలో అత్యంత అధునాతనమైన GPUలు, TPUలు, AI ప్రాసెసర్లను హోస్ట్ చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. కర్నూలులో 170 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సౌకర్యంతో నిర్మించనుంది.
ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు వర్చువల్ శంకుస్థాపన చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీని నిర్మించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో డ్రోన్ డిజైన్, తయారీ, సేవలు, ఆర్ అండ్ డీ రంగాల్లో అభివృద్ధి చెందేలా డ్రోన్ సిటీ నిర్మాణం జరగనుంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో ట్విన్ స్పేస్ సిటీస్ ఏర్పాటు అవుతున్నాయి. స్పేస్ సిటీలో 10 ఏళ్లలో రూ.25,000 కోట్ల పెట్టుబడులు, 35,000కు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా. స్పేస్ సిటీకి సంబంధించి బ్లూ స్పేస్, ఎథర్నల్ ఎక్స్‌ప్లోరేషన్ గిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. అలాగే డ్రోన్ సిటీలో పెట్టుబడులకు అల్గోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అకిన్ అనలిటిక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, సెన్సెల్మేజ్, ఏర్పేస్ ఇండస్ట్రీస్ సంస్థలు ఎంఓయూ చేసుకున్నాయి.

