ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా రాష్ట్ర న్యాయ వ్యవస్థలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని ప్రాంతంలోని పిచ్చుకలపాలెం వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సుమారు రూ. 165 కోట్ల భారీ వ్యయంతో, 4.83 ఎకరాల విస్తీర్ణంలో అత్యధునిక హంగులతో ఈ అకాడమీని రూపొందిస్తున్నారు. మొత్తం 2.05 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ ప్రాంగణంలో ఒకేసారి 120 మంది ట్రైనీ జడ్జిలకు శిక్షణ ఇచ్చేలా వసతులు కల్పిస్తున్నారు. ఇందులో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌తో పాటు 500 మంది కూర్చునే సామర్థ్యం గల అత్యాధునిక ఆడిటోరియం, సెమినార్ హాళ్లు, మూట్ కోర్టు హాల్ , ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
శిక్షణ పొందే న్యాయాధికారుల కోసం అన్ని సౌకర్యాలతో కూడిన జీ ప్లస్ 8 అంతస్తుల భారీ హాస్టల్ బ్లాక్‌ను కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు. ఈ హాస్టల్ భవనంలో 98 గదులతో పాటు విఐపి సూట్ రూమ్‌లు, డైనింగ్ హాల్స్, జిమ్, స్విమ్మింగ్ పూల్ , ఇండోర్ స్పోర్ట్స్ ఏరియాలను ఏర్పాటు చేస్తున్నారు. పచ్చదనానికి పెద్దపీట వేస్తూ, మొత్తం ప్రాంగణంలో 69 శాతం మేర గ్రీన్ స్పేస్‌ను కేటాయించడం విశేషం.
అదేవిధంగా, హైకోర్టుకు సమీపంలో రూ. 69.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహానికి కూడా సీజేఐ శంకుస్థాపన చేశారు. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ భవనం న్యాయమూర్తుల సౌకర్యార్థం సకల సదుపాయాలతో కూడి ఉంటుంది. అమరావతిలో జడ్జిల కోసం నిర్మించిన ఇళ్లను ప్రారంభించారు. అంతకుముందు సీజేఐ తిరుపతిలో పర్యటించి నూతన జిల్లా కోర్టు భవన సముదాయానికి భూమి పూజ నిర్వహించారు.
