మచిలీపట్నంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మచిలీపట్నంలోని రామానాయుడు పేట సెంటర్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నాయకులు పార్టీ జెండా ఆవిష్కరణ కోసం జెండా దిమ్మె ను నిర్మించే ప్రయత్నం చేయడంతో ఈ వివాదం మొదలైంది. పేర్ని నాని నివాసానికి సమీపంలోనే ఈ నిర్మాణం జరుగుతుండటంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు దీనిని అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండానే ఈ నిర్మాణం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుండగా.. తమ పార్టీ జెండాను ఆవిష్కరించుకునే హక్కు తమకు ఉందని జనసేన శ్రేణులు వాదించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి, పరిస్థితి ఘర్షణకు దారితీసింది.
పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు మచిలీపట్నంలో భారీగా మోహరించారు. ముఖ్యంగా పేర్ని నాని నివాసం, కార్యాలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, అటువైపు వెళ్లే మార్గాలను మూసివేశారు. కార్యాలయ సిబ్బందిని సైతం లోపలికి అనుమతించకపోవడంపై పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. సెక్షన్ 30 అమలులో ఉందంటూ పోలీసులు చెబుతున్న కారణాలను ఆయన తప్పుబట్టారు. కేవలం తమ పార్టీ కార్యకలాపాలను అడ్డుకోవడానికే ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని, అధికార పక్ష కార్యక్రమాలకు లేని ఆంక్షలు తమకెందుకని ఆయన హడావుడి చేశారు.
ఈ ఘటన కేవలం జెండా గొడవగానే కాకుండా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మచిలీపట్నంలో రాజకీయ ఆధిపత్య పోరుగా మారింది. జనసేన నాయకులు పోలీసుల అండతోనే ఇక్కడ జెండాలు పాతేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఆంక్షలు విధించామని పోలీసులు చెబుతున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మచిలీపట్నంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.
ఘర్షణకు సంబంధించి ఇరుపక్షాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. జెండా దిమ్మెనిర్మాణం వద్ద ప్రస్తుతం పోలీసు పహారా కొనసాగుతోంది. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఈ వివాదం సందర్భంగా పేర్ని నాని పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదం అవుతోంది.

