డ్రగ్స్‌ కేసు గప్ చుప్..! టాలీవుడ్‌కి క్లీన్ చిట్..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు తేలిపోయింది. సినీ ప్రముఖులందర్నీ వరుసగా పిలిచి.. డైలీ సీరియల్‌గా విచారణ జరిపిన పోలీసులకు.. చివరికి ఏమీ దొరకలేదు. ఓ దక్షిణాఫ్రికాకు చెందిన డ్రగ్ పెడ్లర్ మీద మాత్రం…చార్జిషీట్ దాఖలు చేసి పోలీసులు చేతులు దులుపుతున్నారు. గొప్ప సిన్సియర్ అధికారి అని … ప్రచారం లో ఉన్న అకున్ సభర్వాల్ ఈ కేసును దర్యాప్తు చేశారు. మొత్తానికి… అందరూ అనుకునేదే చేసి చూపించారు.

చార్జిషీట్‌లో ఎవరి పేర్లూ లేవు..!

జూలై 2017 జూన్, జూలై నెలల్లో…. ఉన్న వార్త ఏదైనా ఉందా.. అంటే.. కేవలం డ్రగ్స్ కేసు మాత్రమే. రవితేజ తగ్గర్నుంచి పూరి జగన్నాథ్ వరకు… చార్మీ దగ్గర్నుంచి… ముమైత్ ఖాన్ వరకూ… అరవై మందికిపైగా టాలీవుడ్ ప్రముఖులను.. పోలీసులు విచారించారు. దాదాపుగా అందరి దగ్గర్నుంచి గోళ్లు, వెంట్రుకలు తీసుకున్నారు. వాళ్లు డ్రగ్స్ వాడారో లేదో తేల‌్చేస్తామని.. అకున్ సభర్వాల్ నేతృత్వంలోని విచారణ బృందం బీరాలు పోయింది. దాదాపుగా అందర్నీ విచారించిన తర్వాత.. వారి శాంపిల్స్… పంపాల్సిన చోటికి పంపిన తర్వాత అంతా సైలెంటయిపోయారు. ఆ తర్వాత ఆ కేసులో అప్ డేట్ లేదు. అందరూ మర్చిపోయారనుకున్నారు. ఇలాంటి సమయంలో హఠాత్తుగా చార్జిషీటు దాఖలు చేశారు. ఇందులో.. ఎవరి పేర్లూ లేవు. అందరూ సుద్దపూసలుగా తేలినట్లుగా చార్జిషీట్‌ను బట్టి తేలుతోంది.

విచారణ సమయంలో వచ్చిన “స్టోరీ”లన్నీ ఉత్తుత్తివేనా..?

జూలైలో రోజుకో సెలబ్రిటినీ.. విచారణ పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత… కథలు కథలుగా… వారి వ్యవహారాలు బయటకు వచ్చేవి. అయితే.. ఒక్కటి నేరుగా ఉండేది. మొదట డ్రగ్స్‌ ను సరదాగా అలవాటు చేసుకున్నారని.. తర్వాత వ్యాపారం చేయడం ప్రారంభించారని… ఓ యువ హీరో అయితే.. నేరుగా… డాన్ అయిపోయాడని.. సినిమాల మీద కన్నా.. డ్రగ్స్ మీదనే ఎక్కువ సంపాదిస్తున్నారని ప్రచారం చేశారు. ఇక వయసొచ్చినా గ్లామర్ తో వెలిగిపోయే హీరోయిన్ అయితే… పూర్తిగా డ్రగ్స్ లోకంలో ఉంటుందని కూడా.. చెప్పుకొచ్చారు. టాలీవుడ్ సెలబ్రిటీలను పోలీసులు విచారించిన తర్వాత మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే.. ఎవరూ … బయటపడలేరని.. అందరూ ఇరుక్కుపోయినట్లేనని భావించారు. కానీ.. ఫలితం తేలిపోయింది. అందరూ సూపర్ క్లీన్. ఎవరికీ డ్రగ్స్ అంటే ఏమిటో తెలియదని తేలిపోయింది.

వ్యవహారాన్ని పకడ్బందీగా సెటిల్ చేసేసుకున్నారా..?

నిజానికి డ్రగ్స్ కేసు బయటకు రావడం అనూహ్యంగా జరిగింది. రవితేజ సోదరుడు.. భరత్.. రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో.. ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న ఫోన్‌.. ప్రమాదానికి గురైన కారులో దొరికిన వస్తువుల కారణంగా.. టాలీవుడ్‌లో చాలా పెద్ద డ్రగ్స్ రాకెట్ ఉందని… పోలీసులు గుర్తించారు. ఆ క్రమంలో… కొంత మంది డ్రగ్ పెడ్లర్లను పట్టుకుని కూపీ లాగారు. మొత్తం టాలీవుడ్ ప్రముఖుల గుట్టు బయటకు వచ్చింది. దాని ఆధారంగా జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. అయితే ఈ కేసులను అడ్డం పెట్టుకుని.. కొంత మందిని… రాజకీయ పరంగా బ్లాక్ మెయిల్ చేసి.. తమకు అనుకూలంగా మార్చుకున్నారన్న ప్రచారం జరిగింది. చివరికి టాలీవుడ్ అంతా కలిసి… డ్రగ్స్ కేసు విషయంలో… రాజీకి రావడంతో… మొత్తం వ్యవహారం సెటిలైపోయిందని చెబుతున్నారు. 2017 డిసెంబర్ నుంచి చార్జిషీట్లు వేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2018 జూలైలో.. నలుగురు సినీ సెలబ్రిటీలపై ఆధారాలు దొరికాయని.. వారి గోళ్లు, వెంట్రుకల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయని మీడియాకు లీక్ ఇచ్చారు. చివరికి.. దాదాపుగా… రెండేళ్ల తర్వాత చార్జిషీట్ వేసి తుస్సుమనిపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com