సీఎం అంటే అందరూ చీఫ్ మినిస్టర్ అనుకుంటారు. కానీ చీఫ్ మినిస్టర్ మాత్రం సీఎం అంటే కామన్ మ్యాన్ అనుకోవాలి. చాలా మంది ముఖ్యమంత్రులు అలా అనుకోలేరు. పనుల బిజీ అనుకుంటారు. మరికొంత మంది తాము దైవాంశ సంభూతులం అనుకుంటారు. అలాంటి వారిని ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అనుకునేవారిని మాత్రం .. ప్రజలు ఆ కామన్ మ్యాన్ దగ్గరే అధికారం ఉంచుతారు. చంద్రబాబు ఇప్పుడు కామన్ మ్యాన్ పాలన చేస్తున్నారు.
ప్రజలతో కలిసిపోయే విధానం హైలెట్
దీపావళి సందర్భంగా చంద్రబాబునాయుడు .. విజయవాడలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన బీసెంట్ రోడ్ కువెళ్లారు. అక్కడ దీపావళి మార్కెట్ జరుగుతోంది. వేడుకలు జరుగుతున్నాయి. అక్కడ చంద్రబాబు ఉల్లాసంగా గడిపారు. వ్యాపారులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. అడిగిన వారితో ఫోటోలు దిగారు. సెక్యూరిటీ పేరుతో ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. దాదాపుగా గంటకుపైగా చంద్రబాబు ఆ మార్కెట్ లో గడిపారు. చాలా మంది చిరు వ్యాపారులతో మాట్లాడారు.
ఆయా వర్గాల సమస్యలను అర్థం చేసుకోవడం కీలకం
ఓ ముఖ్యమంత్రి ఇలా రావడాన్ని వారెవరూ ఊహించలేకపోయారు. చాలా మంది ఇది పబ్లిసిటీ స్టంట్ అనుకుంటారు కానీ.. సీఎం చంద్రబాబు లాంటి వాళ్లు అయితే పబ్లిక్ స్టంట్ అనుకుంటారు. పబ్లిక్ తో కలవడం ఆయనకు ఇష్టం. భద్రత కారణాలు.. ఇతర వాటి వల్ల కొన్ని ఆంక్షలు ఉండవచ్చు కానీ.. వాటిని కూడా పక్కన పెట్టి నేరుగా కలిసి సమస్యలు వింటున్నారు. ఇటీవలి కాలంలో పెన్షన్లను పంపిణీ చేసే రోజున .. ఇంకా సమాజంలో వెనుకబడిపోయిన వర్గానికి చెందిన వారి ఇంటికి వెళ్లి వారి ఎదుగుదలకు అడ్డం పడుతున్న అంశాలను అడిగి తెలుసుకుంటున్నారు. అది ఆ ఒక్క కుటుంబానికి పరిమితమయ్యే సమాచారం కాదు. వారిని పైకి తీసుకు రావడానికి అవసరమయ్యే పాలసీల కోసం ఉపయోగపడే సమాచారం.
కామన్ మ్యాన్ సీఎం అని ప్రజల్లో భావన
గతంలో చంద్రబాబు జన్మభూమి, ప్రజల వద్దకు పాలన అంటూ ఎక్కువగా ప్రజల్లో ఉండేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రజల్ని కలిసే స్టైల్ మారిపోయింది. అయితే అది డిజిటల్ గా ఉండకూడదని చంద్రబాబు అనుకుంటున్నారు. నేరుగా ప్రజలతోనే మమేకం అవుతున్నారు. ఆయన రాక ప్రజల్నీ సంతోపరుస్తోంది. కామన్ మ్యాన్ సీఎం అని .. సీఎంను గుర్తు చేసుకుంటున్నారు.