తమను ఓడించడం ప్రజల తప్పు అని పదే పదే బీఆర్ఎస్ నేతలు చెప్పడాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ఇప్పటికైనా ప్రజలను గౌరవించాలని సూచించారు. అధికారంలో పదేళ్లు ఉంటానని అనవసరంగా ప్రజల్ని నిందించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని సలహా ిచ్చారు. పొరుగు రాష్ట్రాలకు నీటిని మళ్లిస్తున్నామంటూ విపక్ష నేతలు కేసీఆర్, హరీష్ రావు చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలు విమర్శలు చేయడం మానుకోవాలని, తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎందుకు రాజీపడతామని ఆయన ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలతో చర్చలు జరిపినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యతని, ప్రజలు ఓడించారనే కోపంతో ప్రభుత్వంపై బురద చల్లడం సరికాదని హితవు పలికారు.
గోదావరి నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బహిరంగ చర్చకు తాము సిద్ధమని ముఖ్యమంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను, ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. ప్రతిపక్షాల నుంచి విలువైన సూచనలు వస్తే స్వీకరించడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, కానీ కేవలం విమర్శల కోసమే విమర్శలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు.
నిధుల కొరత ఉన్నప్పటికీ, రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యంగా దేవాదుల ప్రాజెక్టు అంచనా వ్యయం 6,000 కోట్ల నుండి 18,500 కోట్లకు పెరగడం వెనుక ఉన్న వాస్తవాలను ఆయన వివరించారు. భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు 600 కోట్లు విడుదల చేస్తామని, అన్ని ప్రాజెక్టుల అంచనాలను బడ్జెట్లో ఆమోదించి పనులు వేగవంతం చేస్తామని తెలిపారు.
ప్రాజెక్టులకు ప్రధాన అడ్డంకిగా మారిన భూసేకరణ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది. పరిహారం పంపిణీ కోసం గ్రీన్ ఛానల్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని, దీనివల్ల నిధుల విడుదల వేగంగా జరిగి పనులు ఆగకుండా సాగుతాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూసేకరణ సమస్యలు ఇకపై సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని అడ్డుకోలేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
