కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇన్ఫోసిస్ స్థాపకుడు ఎన్.ఆర్. నారాయణమూర్తి , ఆయన భార్య, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి దంపతులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక-ఆర్థిక-విద్యా సర్వే లో పాల్గొనడానికి వారు నిరాకరించారు. ఇలా నిరాకరిస్తూ వారు ఫామ్‌పై రాసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో సీఎం సిద్ధరామయ్య ఫీల్ అయ్యారు. “ఇన్ఫోసిస్ వారు కాబట్టి అన్నీ తెలుసా? వారు బృహస్పతులా?” అంటూ సెటైర్ వేశారు. ఇది ఆయన సెటైర్ అనుకున్నారు కానీ.. కర్ణాటక మొత్తం అహంకారం అనుకుంటున్నారు.
సామాజిక-ఆర్థిక-విద్యా సర్వే అనే పేరు పెట్టారు కానీ.. అది కులగణన. రాజకీయం చేస్తున్న కార్యక్రమం. గతంలో చేశారు కానీ.. అది వ్యాలీడ్ కాలేదు. విమర్శలు వచ్చాయి. దాన్ని పక్కన పెట్టి కొత్తగా ఈ పేరుతో కులగణన ప్రారంభించారు. అసలు విషయాలను పట్టించుకోకుండా ఇలాంటి రాజకీయాలు చేయడంపై వ్యాపార సమాజంలో అసహనం ఉంది. దాన్ని ఇన్ఫోసిస్ దంపతులు బయట పెట్టారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలు రాజకీయ వివాదాన్ని రేపాయి. బీజేపీ నేతలు దీనిని విమర్శిస్తున్నారు, అయితే కాంగ్రెస్ నేతలు సర్వే ఉద్దేశ్యాన్ని సమర్థిస్తున్నారు. నెటిజన్లలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారంపై విమర్శలు వస్తున్నాయి.
కర్ణాటకలో 2015లో సిద్ధరామయ్య మొదటి పాలనా కాలంలోనే కుల గణన జరిగింది. అది రాష్ట్రంలో మొదటి సమగ్ర సామాజిక-ఆర్థిక సర్వే, కానీ ఆ నివేదిక అమలు కాలేదు. ఇప్పుడు 2025లో మరోసారి ఈ సర్వే ప్రారంభమైంది. కులగణనను రాష్ట్రంలో లింగాయత్, వొక్కలిగ వంటి ప్రధాన వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. హైకోర్టు దీనిని స్వచ్ఛందంగా ప్రకటించింది, సమాచారం బలవంతంగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అయినా కర్ణాటక కాంగ్రెస్ పాలకులు.. మాత్రం.. వివాదాలు లేకపోతే తమకు రోజు గడవదన్నట్లుగా రాజకీయం చేసుకుంటున్నారు.