నెల్లూరు నుంచి ఏపీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మధ్య పొసగడం లేదు. లోకేష్ సమక్షంలోనే ఈ విషయం బయటపడింది. మంత్రి నారాయణ ఎలాంటి స్పందన వ్యక్తం చేయనప్పటికీ.. ఆయనపై మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి హయాంలో ఎయిడెడ్ స్కూళ్లపై తీసుకున్న నిర్ణయం కారణంగా మూతపడిన వెంకటగిరి రాజా స్కూల్ ను పదిహేను కోట్లతో ఖర్చుతో పునరుద్ధరించారు. దీన్ని లోకేష్ ప్రారంభించారు.
ఈ సభా వేదికపై ఆనం రామనారాయణరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ స్కూల్ గతంలో తమ పర్యవేక్షణలో ఉండేదని.. జగన్ తమపై కక్ష కారణంగా మూసవేయించారన్నారు. ఇప్పుడు వీఆర్ రాజా మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ అని పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నారు. కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు సీఎస్ఆర్ ఫండ్స్ కింద డబ్బులు ఇచ్చాయన్నారు. కార్పొరేషన్ కు ఏం సంబంధమని.. కార్పొరేషన్ పేరు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. మంత్రి ఎక్కడ ఈ స్కూల్ కోసం సహకరించారో చెబితే తెలుసుకుంటామన్నారు. ఈ మాటలు మంత్రి నారాయణపై ఉన్న కోపాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాయి.
పొంగూరు నారాయణ మున్సిపల్ మంత్రిగా ఉన్నారు. చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అమరావతి నిర్మాణ బాధ్యతలు అత్యధికంగా ఆయనకే ఉన్నాయి. అదే సమయంలో నెల్లూరులోనూ ఆయనే చక్రం తిప్పుతున్నారు. సీనియర్ మంత్రిగా ఉన్న ఆనం ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. అందుకే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.