స్టేజ్ ఎక్కినప్పుడు అలీ తీరు అంతా మాస్…ఊరమాస్ అన్నట్టుగా ఉంటుంది. ముందు వరుసలో కూర్చున్న వాళ్ళకంటే కూడా బ్యాక్ బెంచర్స్ చేత విజిల్స్ కొట్టించడం, కేకలు పెట్టించడమే లక్ష్యంగా మాట్లాడేస్తూ ఉంటాడు అలీ. ఆ ప్రయత్నంలోనే చాలా సార్లు కాస్త ఎక్కువ ఉత్సాహపడిపోయి బూతులు మాట్లాడేయడం….బూతులు తిట్టించుకోవడం లాంటి కార్యక్రమాలతో మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాడు అలీ. అయితే సినీ పరిశ్రమలో ఉన్న చాలా మంది కంటే కూడా అత్యంత ఎక్కువ అనుభవజ్ఙుడైన అలీ ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఆడియో ఫంక్షన్లో మాత్రం చాలా మంచి సలహాలే ఇచ్చాడు. వాటిని సునీల్పైన అలీ పేల్చిన సెటైర్స్గా చెప్తున్నారు కానీ అవి సెటైర్స్ కాదు, మంచి సలహాలు మాత్రమే.
కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్….ఇంకా ఎవ్వరైనా సరే… వాళ్ళు హీరోలుగా యాక్ట్ చేస్తేనే న్యాయం జరిగే స్థాయి కథలు వచ్చినప్పుడు మాత్రమే హీరో వేషాలు వేస్తే బాగుంటుంది. రాజేంద్రప్రసాద్, అల్లరి నరేష్లాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ హీరోలు కూడా మధ్య మధ్యలో సపోర్టింగ్ క్యారెక్టర్స్, సెకండ్ హీరో క్యారెక్టర్స్ చేసిన వాళ్ళే. అల్లరి నరేష్‌కి కూడా మొదట్లో అలాంటి ప్రయత్నాలే చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. యమలీల, మర్యాదరామన్నలాంటి కథలలో కమెడియన్స్ హీరోలుగా కనిపిస్తే ఆ కథలకూ అందం…ఆ కమెడియన్స్‌కి కూడా గౌరవం.
నటీనటులందరికీ కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. సిక్స్ ప్యాక్లాంటివి ఎవరైనా సాధించొచ్చేమో కానీ అన్ని రకాల ఎమోషన్స్‌ని పలికించడం, అన్ని రకాల సినిమాల్లో యాక్ట్ చేయడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. కమల్ హాసన్‌లాంటి యూనివర్సల్ యాక్టర్ కూడా మన సమరసింహారెడ్డి, సింహాద్రి, గబ్బర్‌సింగ్‌లాంటి సినిమాల్లో హీరోగా ఆ స్థాయిలో యాక్టింగ్ చేయలేకపోవచ్చు. సునీల్‌కి…ఆ మాటకొస్తే సుమంత్లాంటి హీరోలు కూడా కొన్ని విషయాల్లో ప్రతిభావంతులే. వాళ్ళ యాక్టింగ్ శైలికి తగ్గ క్యారెక్టర్స్, కథలు పడితే కచ్చితంగా రాణిస్తారు. అయితే అలాంటి కథలు వచ్చినప్పుడే హీరోలుగా చేస్తూ మిగతా సమయాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా యాక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకే మంచిది. చాలా సినిమాల్లో కమెడియన్స్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్‌గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి ఉంటారు కాబట్టి… వాళ్ళు హీరోలుగా యాక్ట్ చేసిన సినిమాలు వచ్చినప్పుడు స్పెషల్ క్రేజ్‌తో పాటు ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా బాగుంటాయి. సినిమా బాగుంటే ఇక రిజల్ట్ గురించి చెప్పనవసరం లేదు. అలా కాకుండా మేము హీరోలుగానే యాక్ట్ చేస్తాం అని పట్టు పట్టుకు కూర్చుంటే మాత్రం ప్రేక్షకులకు పూర్తిగా దూరమయిపోయే అవకాశం కూడా ఉంటుంది మరి.